MRO Ramanaiah Case: ఏపీలో సంచలనంగా మారిన ఎమ్మార్వో రమణయ్య మర్డర్ కేసులో నిందితుడిని 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కస్టడీలో భాగంగా పోలీసులు రెండో రోజు పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని విచారిస్తున్నారు. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు గంగారాం కాల్ డేటా కీలకంగా మారింది. పీఎం పాలెం పోలీసు స్టేషన్‌కు సిటీ పోలీసు కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్, డీసీపీ-1, ఇతర ఉన్నతాధికారులు చేరుకొని మరో మర్డర్ కేసు విచారణ తీరును పర్యవేక్షించారు. పోలీసు కస్టడీలో రెండో రోజు నిందితుడు గంగారాం విచారణ కొనసాగుతుంది. హత్య జరిగిన రోజు ఫోన్ కాల్స్ వివరాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. హత్య కోణం వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా చేయించారా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ఐదు రోజుల కస్టడీ ముగిశాక పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు.
Read Also: Tragedy: తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్య..
విశాఖపట్నం కొమ్మాదిలో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. ఎమ్మార్వో రమణయ్య హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు చరణ్ క్యాసిల్‌లో ఉంటున్న రమణయ్య ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. ఐరన్ రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. వాచ్ మెన్ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. తరువాత రమణయ్యను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించారు. సీసీ టీవీ కెమెరాలు, వాచ్‌మ్యాన్ సాక్ష్యం ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన గంగారాంను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఎమ్మార్వో అతడు ఎందుకు హత్య చేశాడో తెలియాల్సి ఉంది. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.