30Kg Tumor : వారణాసిలోని మహామన పండిట్ మదన్ మోహన్ మాల్వియా క్యాన్సర్ సెంటర్, హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ ప్రతిరోజూ క్యాన్సర్ చికిత్స రంగంలో కొత్త విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆసుపత్రి వైద్యులు చాలా క్లిష్టమైన క్యాన్సర్ శస్త్రచికిత్స చేసి రోగి కడుపు నుండి 30.5 కిలోల కణితిని తొలగించారు. కణితి పరిమాణం చాలా పెద్దదిగా ఉండడంతో రోగికి నడవడం కష్టతరమైంది. శస్త్ర చికిత్స చేసి ఆ రోగికి కొత్త జీవితాన్ని అందించారు ఆస్పత్రి వైద్యులు.
ఒక 55 ఏళ్ల వ్యక్తి పొత్తికడుపు వాపు రావడంతో ఆసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు రోగి కడుపులో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం క్యాన్సర్ ఆసుపత్రి శస్త్రచికిత్స విభాగం అసోసియేట్ ప్రొఫెసర్. మయాంక్ త్రిపాఠి, అతని బృందం (డా. విదుర్, డాక్టర్. రవీంద్ర వర్మ) శస్త్రచికిత్స చేశారు.
Read Also: Viral: ఏం ఐడియా రా బాబు… నువ్వు కేక అంతే
రోగికి రెట్రోపెరిటోనియల్ లిపోసార్కోమా అనే అరుదైన క్యాన్సర్ ఉందని డాక్టర్ మయాంక్ త్రిపాఠి తెలిపారు. ఈ కణితి రోగి ఉదరం లోపల ప్రధాన రక్త నాళాల దగ్గర ఉంది. కణితి పరిమాణం చాలా పెద్దది కావడం, చాలా సున్నితమైన ప్రదేశంలో ఉండటంతో, దానిని తొలగించడానికి 6 గంటల పాటు నిరంతర శస్త్రచికిత్స జరిగింది. రోగి కడుపు నుండి తొలగించిన కణితి పరిమాణం 64 సెం.మీ. పొడవు, 46 సెం.మీ. వెడల్పుగా ఉంది. ఇది ఇప్పటివరకు దేశంలో రెట్రోపెరిటోనియల్ లిపోసార్కోమా క్యాన్సర్ కణితి. కణితి బరువు 12 నవజాత శిశువుల బరువుకు సమానంగా పేర్కొన్నారు.
రోగికి రెట్రోపెరిటోనియల్ లిపోసార్కోమాతో పాటు కిడ్నీ క్యాన్సర్ కూడా ఉంది. శస్త్రచికిత్స సమయంలో రెండు కణితులను కలిపి తొలగించారు. ఆసుపత్రిలో శస్త్రచికిత్స ద్వారా 10-12 కిలోల కణితులను తరచుగా తొలగిస్తారని, అయితే ఇప్పటివరకు ఇంత భారీ కణితిని తొలిసారిగా విజయవంతంగా తొలగించామని డాక్టర్ మయాంక్ త్రిపాఠి తెలిపారు.
Read Also: Governor Tamilisai: యాదాద్రి నరసింహ స్వామి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై
క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సత్యజిత్ ప్రధాన్, శస్త్రచికిత్స చేసిన బృందాన్ని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే నిబద్ధతతో పని చేసేలా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహామన పండిట్ మదన్ మోహన్ మాలవ్య కేన్సర్ సెంటర్, హోమీ భాభా కేన్సర్ ఆస్పత్రిలో క్యాన్సర్‌కు సంబంధించిన అత్యంత సంక్లిష్టమైన, అతిపెద్ద శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
