NTV Telugu Site icon

Vijaya Sai Reddy: వైసీపీ, బీజేపీ సంబంధాలపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబు ట్రాప్‌లో అమిత్ షా..?

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అంతా భావిస్తుండగా.. ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ఉన్నట్టుండి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు గుప్పించడం చర్చగా మారింది. అయితే, సీఎం వైఎస్‌ జగన్‌ నుంచి మంత్రులు, వైసీపీ నేతలు ఇలా అంతా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, తాజా పరిస్థితులపై మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమమన్వయం ఉంటుందని స్పష్టం చేసిన ఆయన.. కేంద్రాన్ని రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉంటుందన్నారు.. పార్టీ వేరు, ప్రభుత్వం వేరన్న ఆయన.. రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయని పేర్కొన్నారు.

Read Also: Nasa: అంతరిక్షంలో పెరిగిన పువ్వు.. ఎలా ఉందో తెలుసా..!

ఇక, అవినీతి ఎక్కడ జరిగిందో అమిత్ షా, జేపీ నడ్డా చెప్పలేకపోయారన్నారు సాయిరెడ్డి.. కేంద్రం ఇచ్చే నిధులకు ఆడిటింగ్ నిర్వహిస్తారు.. వాళ్ల ఆడిటింగ్ లో ఎక్కడైనా అవినీతి జరిగిందని గుర్తించారా..? చెప్పాలని డిమాండ్‌ చేశారు.. అవినీతి అని సాధారణ ఆరోపణలు చేశారు.. బీజేపీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు పై ప్రకటన చేయలేదని దుయ్యబట్టారు.. విభజన చట్టంలో హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. మరోవైపు.. వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.. అయితే, చంద్రబాబు ట్రాప్ లో అమిత్ షా పడతారా..? అని ప్రశ్నించారు సాయిరెడ్డి.. అసలు బాబు ట్రాప్ లో పడాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా..? అని ఎద్దేవా చేశారు.

Read Also: Cyclone Biparjoy: భీకర తుఫానులో కోస్ట్‌గార్డ్ సాహసం.. సముద్రం నుంచి 50 మంది రెస్క్యూ..

అన్ని పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటాయి.. అందులో భాగంగా రాజకీయ నేతలు ఏ పార్టీపై అయినా విమర్శలు చేసే అవకాశం ఉంటుందన్నారు సాయిరెడ్డి.. కానీ, విశాఖపట్నంకు ఖచ్చితంగా పరిపాలన రాజధాని తరలిస్తామని క్లారిటీ ఇచ్చారు.. రెండేళ్ల కిందటే పరిపాలన రాజధానికి కావాల్సిన ఆఫీస్‌లు గుర్తించామని తెలిపారు. ఇక, కేంద్రం నుంచి రెవెన్యూ లోటు రూ.10, 400 కోట్లు సాధించామని ప్రకటించారు.. కేబినెట్‌ ఆమోదం తర్వాత పోలవరం ప్రాజెక్టుకు నిధులు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. మరోవైపు.. ఎన్నికల లోపు ప్రతీ కార్యకర్తని సంతృప్తి పరుస్తాం అన్నారు.. చంద్రబాబు మినీ మేనిఫెస్టోని ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు.. నవంబర్ లో ఇతర రాష్ట్రాల హామీలను కాపీ కొట్టి చంద్రబాబు పార్ట్ 2 మేనిఫెస్టో ఇస్తారేమో అంటూ సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.