NTV Telugu Site icon

ED Case: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కి మళ్లీ నిరాశ.. ఊరట ఇవ్వని కోర్టు

Aap Mp

Aap Mp

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ (Sanjay Singh)కు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సంజయ్ సింగ్ బెయిలు దరఖాస్తుపై ఢిల్లీ హైకోర్టు జనవరి 31 తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బుధవారం విచారణ చేపట్టి బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చి న్యాయస్థానం ఝలక్ ఇచ్చింది.

కేసు దర్యాప్తులో భాగంగా ప్రస్తుత పరిస్థితుల్లో నిందితుడికి బెయిలు మంజూరు చేయలేమని ధర్మాసనం తెలిపింది. త్వరతిగతిన విచారణ జరపాలని ట్రయిల్ కోర్టును ఆదేశిస్తున్నట్లు తెలిపింది. ఇరువర్గాలు ఎలాంటి వాయిదాలు కోరవద్దని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తన తీర్పులో పేర్కొన్నారు.

కాగా ఈ కేసులో తన ప్రమేయం లేనప్పటికీ తనను మూడు నెలలకు పైగా తనను నిర్బంధంలో ఉంచారని సంజయ్ సింగ్ బెయిలు దరఖాస్తులో కోర్టుకు విన్నవించారు. అయితే సంజయ్ సింగ్‌కు ఈ స్కామ్‌తో ప్రమేయం ఉన్నందున ఆయనకు బెయిల్ ఇవ్వరాదంటూ ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో సంజయ్ సింగ్‌కు కీలక పాత్ర ఉందనే అభియోగంపై 2023 అక్టోబర్ 4న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అక్టోబర్ 13 నుంచి ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.