NTV Telugu Site icon

Chamala Kiran Kumar Reddy : బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో పెండింగులో ఉంది

Chamala Kiran Kuma Reddy

Chamala Kiran Kuma Reddy

తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద 31 అంశాలు పెండింగులో ఉన్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో అనేక శాఖలకు సంబంధించినవి ఉన్నాయని, రెసిడెంట్ కమిషనర్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నానని ఆయన తెలిపారు. పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు కేంద్రాన్ని కలిసి మాట్లాడారని, మేం కూడా మా వంతుగా ఈ పెండింగ్ అంశాలపై కేంద్రంతో చర్చిస్తామన్నారు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి. పెండింగ్ అంశాలపై రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల సభ్యులు కలిసి పనిచేయాలని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో పెండింగులో ఉందన్నారు ఆయన. విభజన హామీల్లో ఇది మొట్టమొదటిది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని, సైనిక్ స్కూల్ వ్యవహారం కూడా ఇంకా పెండింగులోనే ఉందన్నారు. నేషనల్ డిజైన్ సెంటర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, 2019 నుంచి ఈ అంశం పెండింగులో ఉందన్నారు ఎంపీ కిరణ్‌ కుమార్‌ రెడ్డి.

అంతేకాకుండా..’ఉమ్మడి సంస్థల విభజన అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఇంకా పెండింగులో ఉంది. ఇప్పుడు ఈ శాఖకు సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. స్మార్ట్ సిటీస్.. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరాలైన వరంగల్, కరీంనగర్‌ను స్మార్ట్ సిటీస్ చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ స్పందనలో ఇబ్బంది లేదు. సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ ఆచరణలో అమల్లోకి తేవాలి. వెనుకబడి జిల్లాల అభివృద్ధికి ఇచ్చే నిధులు కూడా పెండింగులో ఉన్నాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశం కూడా ఇంకా నెరవేరలేదు. సెక్షన్ 11(ఏ) ఎంఎండీఆర్ యాక్ట్ ప్రకారం సింగరేణి బ్లాకులను ఆ సంస్థకే వదిలిపెట్టాలి. వాటిని వేలం వేయడానికి వీల్లేదు. తెలంగాణకు సింగరేణి ఒక లైఫ్ లైన్. కానీ వేలం వేయడం ద్వారా దాన్ని చంపేస్తున్నట్టే అవుతుంది. కిషన్ రెడ్డి ఈ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఈ అంశాన్ని అడ్రస్ చేయాలి. ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరు చేసి రద్దు చేశారు. దాన్ని తెలంగాణకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోసం ప్రతిపాదనలు పంపించాం. 18వ లోక్‌సభలోనైనా తెలంగాణకు అన్యాయం జరగొద్దు అన్నదే మా ఆలోచన. ప్రధాని మోడీ తెలంగాణను కూడా గుజరాత్ అనుకోవాలి. బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగులో కాంగ్రెస్‌ను దూషించడంతోనే సరిపెట్టారు తప్ప 8 మంది ఎంపీలను ఇచ్చిన తెలంగాణకు ఏం చేస్తామో చెప్పలేకపోయారు. దక్షిణ భారతదేశం నుంచే జీఎస్టీకి అత్యధిక వసూళ్లు జరుగుతున్నాయి. అందులో తెలంగాణ అత్యధికంగా అందజేస్తోంది. కానీ రాష్ట్రాల వాటా తిరిగి పొందే విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. రీజనల్ రింగ్ రోడ్ గురించి కూడా మా ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తుందో మీకు తెలుసు. కేంద్రంతో పెండింగ్ అంశాల గురించి తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.’ అని ఎంపీ కిరణ్‌ కుమా రెడ్డి వ్యాఖ్యానించారు.