NTV Telugu Site icon

Tata Motors and Uber: టాటా మోటార్స్‌తో దేశంలోనే పెద్ద ఒప్పందం కుదుర్చుకున్న ఉబర్‌

Tata Motors and Uber

Tata Motors and Uber

Tata Motors and Uber: ఉబర్‌ సంస్థ అతిత్వరలో హైదరాబాద్‌లో విద్యుత్‌ కార్లను ప్రవేశపెట్టనుంది. తద్వారా భాగ్య నగరంలో కాలుష్య నియంత్రణకు తనవంతు కృషి చేయనుంది. ఈ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ సరఫరా కోసం ఉబర్‌ కంపెనీ.. టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా మోటార్స్‌ 25 వేల ఎక్స్‌ప్రెస్‌-టీ మోడల్‌ వాహనాలను ఉబర్‌ సంస్థకు అందిస్తుంది.

మన దేశంలోని గ్రీన్‌ మొబిలిటీ సెక్టార్‌లో ఇంత పెద్ద ఒప్పందం కుదరటం ఇదే తొలిసారి. ఉబర్‌ కంపెనీ ఈ వాహనాలను ప్రీమియం కేటగిరీలో వినియోగించుకోనుంది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో ప్రవేశపెట్టనుంది. టాటా మోటార్స్‌ ఇదే నెలలో వీటి డెలివరీని ప్రారంభించనుంది.

Vostro Accounts: విదేశాలతో రూపాయల్లో వాణిజ్యానికి వోస్ట్రో అకౌంట్లు ఎలా పనిచేస్తాయి?

కాబట్టి ఇవి త్వరలోనే రోడ్ల మీదికి వచ్చే అవకాశం ఉంది. అయితే.. డీల్‌కి సంబంధించిన ఆర్థిక వివరాలను రెండు కంపెనీలూ వెల్లడించలేదు. టాటా మోటార్స్‌ 2021 జులైలో ఎక్స్‌ప్రెస్‌ బ్రాండ్‌ను లాంఛ్‌ చేసింది. దీని కింద తొలిసారిగా ఎక్స్‌ప్రెస్‌-టీ పేరుతో విద్యుత్‌ వాహనాన్ని రూపొందించింది. ఎక్స్‌ప్రెస్‌-టీ సెడాన్‌లో రెండు రేంజ్‌ల వాహనాలను తయారుచేసింది. 315 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేది ఒకటి కాగా 277 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేది మరొకటి.

ఎక్స్‌ప్రెస్‌-టీ వాహనాల ఎక్స్‌షోరూం ధర ఢిల్లీలో 13 లక్షల నాలుగు వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. 315 కిలోమీటర్ల వేగం కలిగిన వాహనం రేటు దగ్గరదగ్గరగా 15 లక్షల రూపాయలు. ఇందులో రెండున్నర లక్షల రూపాయలకు పైగా ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుంది. ఈ ఒప్పందం పట్ల ఇరు సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. తమ వ్యాపారాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయని ఆశాభావం వెలిబుచ్చాయి.