భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో చైనా మాంజా ఉపయోగంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరేసేందుకు వాడిన నిషేధిత చైనా మాంజా ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడంతో అతని మెడకు తీవ్రంగా గాయమైంది. ఈ ఘటనలో రక్తస్రావం అధికంగా కావడంతో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు అతనిని కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం తర్వాత హైదరాబాద్‌కి తరలించారు. యాదగిరిగుట్టలో చైనా మాంజా తగిలి వృద్ధ దంపతులు బైకు నుంచి కింద పడ్డారు. బాధితులకు గాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
యువకుడి గొంతు కోసిన మాంజా..
వికారాబాద్‌కు చెందిన వెంకటేష్ బంధువులతో కలిసి ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి జిల్లా కర్దనూరు రహదారి మీదగా శంకరపల్లి వైపు వెళుతున్నాడు. అదే సమయంలో గాలిపటం కోసం కట్టిన చైనా మాంజా అతని గొంతుకు తగిలి కోసుకుపోయింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చూసి వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో బాధితుడిని పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
డేంజార్ మాంజాతో 21ఏళ్ల యువకుడు బలి..
ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో బైక్‌పై వెళ్తున్న 21 ఏళ్ల యువకుడి సుహైల్ మాంజా దారం కారణంగా మరణించాడు. రోడ్డుపై పడి ఉన్న మాంజా బైక్‌పై వెళ్తుండగా గొంతును కోసింది. రెండు చెట్ల మధ్య ఉన్న మాంజా దారం గొంతుని సగానికి పైగా కోసింది. దీంతో సుహైల్ బైక్ బోల్తా పడింది. వెనకాల కూర్చున్న సుహైల్ స్నేహితుడు నవాజీష్‌కి కూడా గాయాలయ్యాయి. దారం అతడి ముక్కుని కోసింది. ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సుహైల్ మరణించాడు.
పీకలు కోస్తు్న్న మాంజా..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు.. ఏటా ఈ చైనా మాంజాతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాహనదారుల మెడలు కోస్తున్నాయి. పతంగుల మాంజా వల్ల పక్షుల మీద గాయాలు, మరణాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. గాలిలో స్వేచ్ఛగా ఎగరే పక్షులు చైనా మాంజా తగిలి గాయపడటం అనివార్యం అవుతోంది. ఈ కారణంగా పక్షుల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించి చైనా మాంజాను పూర్తిగా నిషేధించడంపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగరేసేవారు చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల ఈ పాత బస్తీలో భారీగా దాదాపు రూ.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కానీ.. ఇప్పటికే చాలా మంది ఈ మాంజాను కొనుగోలు చేశారు.