Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హన్మకొండ, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్ష సూచన జారీ చేశారు. ఈ జిల్లాల్లో మధ్యాహ్నం వరకు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే అవకాశం ఉండటంతో మున్సిపల్ సిబ్బంది, విపత్తు నిర్వాహక బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
READ MORE: Crow Like a Pet: కుటుంబంలో ఒక్కటైన కాకి.. నల్గొండ జిల్లాలో వింత ఘటన
మరోవైపు.. హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మొంథా తుఫాన్ ప్రభావంతో నగరవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి నుంచే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూళ్లకు, కాలేజీలకు, ఉద్యోగాలకెళ్లే వాళ్లు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇళ్లలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉండి నీటి మట్టం పెరిగిన ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు మరికొన్ని గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
