Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వానికి అందిన వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరంగల్ జిల్లాలో పంట నష్టం చోటు చేసుకోగా, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ రైతులు భారీగా నష్టపోయారు. తుఫాను కారణంగా ప్రధానంగా వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2.80 లక్షల ఎకరాల్లో వరి పంట, 1.50 లక్షల ఎకరాల్లో పత్తి, 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 3 వేల ఎకరాల్లో మిరప, వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారంపై సమగ్ర నివేదిక సిద్ధం చేసేందుకు సూచనలు జారీ చేసినట్లు సమాచారం.
READ MORE: Word of the Year: వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ’67’..ఎందుకంటే..?
మరోవైపు.. మొంథా తుఫాను ఎఫెక్ట్ తో ఆర్ అండ్‌బీ రోడ్లు 334 లోకేషన్స్‌లో 230 కి.మీ దెబ్బతిన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రోడ్లు భవనాలు శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. తాజాగా తుఫాన్ ఎఫెక్ట్స్‌పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి మాట్లాడారు. నిన్న అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.. దెబ్బతిన్న, కోతకు గురైన రోడ్లు, బ్రిడ్జిలు, కాజ్‌వేల తాత్కాలిక పునరుద్ధరణకు సుమారు రూ. 7కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ. 225 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించినట్లు స్పష్టం చేశారు. తుఫాన్ వల్ల అకాల వర్షాలతో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరి, పత్తి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని తెలిపారు.
