NTV Telugu Site icon

Mohammed Shami: నువ్ క్రికెట్‌లో ఎలా భాగమయ్యావో తెలియడం లేదు.. పాకిస్తాన్ మాజీపై షమీ ఫైర్!

Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami Fires on Hasan Raza: వన్డే ప్రపంచకప్‌ 2023లో బీసీసీఐ చీటింగ్ చేస్తోందని, భారత జట్టుకు స్పెషల్ బాల్స్ ఇస్తోందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజా ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. లీగ్ దశలో భారత్ వరుస విజయాలు చూసి ఓర్వలేని హసన్.. తన అక్కసు వెళ్లగక్కాడు. తాజాగా హసన్ వ్యాఖ్యలపై భారత సీనియర్ పేసర్ మహ్మద్‌ షమీ స్పందించాడు. హసన్ చేసిన వ్యాఖ్యలను చూసి తాను ఆశ్చర్యపోయానన్నాడు. హసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలా భాగమయ్యాడో తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని షమీ అన్నాడు.

స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం పుమా నిర్వహించిన చాట్‌లో హసన్ రజా వ్యాఖ్యలపై మహ్మద్‌ షమీ స్పందించాడు. ‘ప్రపంచకప్‌ 2023లో మొదట జరిగిన మ్యాచ్‌లలో నేను ఆడనప్పుడు కూడా ఈ ఆరోపణలను విన్నా. నా తొలి మ్యాచ్‌లో 5 వికెట్లు తీశా. తర్వాతి మ్యాచ్‌లో 4, ఆ తర్వాతి మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాను. ఇది కొందరు పాకిస్తాన్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. దానికి నేనేం చెయ్యగలను. వారి మనస్సులో మేము అత్యుత్తమం అని అనుకున్నారు. అయితే సరైన సమయంలో ప్రదర్శన చేసే ఆటగాళ్లే అత్యుత్తమమని నేను భావిస్తున్నాను’ అని షమీ అన్నాడు.

‘హసన్ రజా వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. బంతి వేరే రంగులో కనిపిస్తోంది, వేరే కంపెనీ బంతులను వాడుతున్నారు, ఐసీసీ మీకు వేరే బంతులను అందించిందని హసన్ అంటున్నాడు. ముందుగా హసన్ తన ఆలోచలను సరిదిద్దుకోవాలి. ఓ ఇంటర్వ్యూలో వసీమ్ అక్రమ్‌ దీని గురించి వివరించాడు. క్రికెట్ ఆడని వారు ఇలా మాట్లాడితే ఓ అర్థం ఉంది కానీ.. నువ్వు మాజీ ఆటగాడివి. ఇలా మాట్లాడితే జనాలు నవ్వుకుంటారు’ అని మహ్మద్‌ షమీ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ 2023 లో షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 7 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లు పడగొట్టగా.. ఇందులో మూడుసార్లు 5 వికెట్ల ఘనత ఉంది.

Also Read: Akhilesh Yadav-World Cup 2023: అక్కడ ఆడితే భారత్ ప్రపంచకప్‌ గెలిచేది.. అఖిలేశ్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘వన్డే ప్రపంచకప్‌ 2023 మ్యాచులు చూస్తుంటే బీసీసీఐ చీటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. మిగతా జట్ల బౌలర్ల కన్నా.. భారత బౌలర్లకు ఎక్కువ స్వింగ్ లభిస్తోంది. బీసీసీఐ, ఐసీసీ టీమిండియాకు స్పెషల్ బాల్స్ ఇస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. డీఆర్ఎస్ నిర్ణయాలు కూడా టీమిండియాకే అనుకూలంగా వస్తున్నాయి. దీనిపై ఐసీసీ విచారణ జరిపించాలి’ అని హసన్ రజా లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతుండగా అన్నాడు. హసన్ వ్యాఖ్యలను అప్పుడే వసీమ్ అక్రమ్‌ తిప్పికొట్టాడు.

Show comments