Site icon NTV Telugu

Mohammed Shami: టీమిండియాలో చోటుపై ఎలాంటి ఆశలూ లేవు.. షమీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami React On Team India Selection: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్‌ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతానికి భారత జట్టులో చోటు దక్కించుకునే విషయమై తనకు ఎలాంటి ఆశలూ లేవు అని తెలిపాడు. ఒక వేళ అవకాశం ఇస్తే మాత్రం తన పూర్తి శక్తి, సామర్థ్యాలతో ఆడటానికి ప్రయత్నిస్తా అని చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు తాను అందుబాటులోనే ఉన్నానని, సెలక్షన్‌ అనేది నా చేతిలో లేని వ్యవహారం అని పేర్కొన్నాడు. ఇటీవల తనను బీసీసీఐ సెలెక్టర్లు బెంగళూరుకు పిలిచారని, బ్రాంకో టెస్ట్‌ (ఫిట్‌నెస్‌ టెస్ట్‌) కూడా క్లియర్‌ చేశానని షమీ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్‌ 2025 కోసం ఎంపిక చేసిన టీమిండియా స్వ్కాడ్‌లోనూ షమీకి చోటు దక్కని విషయం తెలిసిందే.

వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం మహ్మద్‌ షమీ పెద్దగా రాణించలేదు. వరుస గాయాలు అతడికి ఆటంకంగా మారాయి. భారత్ తరఫున చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో ఆడాడు. ఐపీఎల్‌ 2025లోనూ రాణించలేదు. భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక కాలేదు. ఆసియా కప్‌ 2025కి కూడా అతడిని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. రెండేళ్ల కిందట చివరిసారిగా టెస్టు మ్యాచ్‌ ఆడాడు అంటే.. పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2025లో ఈస్ట్‌జోన్‌ తరఫున షమీ ఆడుతున్నాడు. దులీప్ ట్రోఫీ ముందు బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. అయినా కూడా భారత జట్టులో చోటు దక్కలేదు.

Also Read: YS Jagan: సినిమాలు, సీరియళ్లను మించి ప్రకటనలు చేసి.. ఇప్పుడు మోసం చేస్తారా?

ఓ పాడ్‌కాస్ట్‌లో మహ్మద్‌ షమీ మాట్లాడుతూ… ‘ఇప్పుడైతే భారత జట్టులో చోటుపై నాకు ఎలాంటి ఆశలూ లేవు. ఒక వేళ అవకాశం ఇస్తే నా పూర్తి శక్తి, సామర్థ్యాలతో ఆడటానికి ప్రయత్నిస్తా. ఒక బీసీసీఐ సెలెక్టర్లు అవకాశం ఇవ్వకుంటే నేను ఏమీ చేయలేను. సెలక్షన్‌ అనేది నా చేతిల్లో లేదు. నేను అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉన్నా. నన్ను బెంగళూరుకు పిలిస్తే.. ఫిట్‌నెస్‌ టెస్ట్‌ కూడా క్లియర్‌ చేశా. నన్ను సెలక్ట్‌ చేయని విషయమై ఎవరినీ నిందించాలనుకోవడం లేదు. నేను జట్టుకు అవసరం అనుకుంటే ఎంపిక చేస్తారు. టీమిండియాకు అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసే బాధ్యత సెలక్టర్లపై ఉంటుంది. నేను చాలా కష్టపడుతున్నా. నా శక్తి, సామర్థ్యాల మీద పూర్తి నమ్మకం ఉంది. ఒక్కటి మాత్రం చెబుతా.. టీమిండియాలో అవకాశం వస్తే నా బెస్ట్‌ ఇస్తా’ అని చెప్పాడు.

Exit mobile version