Mohammed Shami: షమీ పొలిటికల్ ఎంట్రీ?.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో షమీ భేటీ..

Shami

Shami

భారత స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీ ఆదివారం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో భేటీ కావడం దేశ రాజకీయ, క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొద్ది వారాలకే ఆయన బీజేపీ అగ్రనేతను కలవడంతో, త్వరలోనే షమీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సమావేశంలో బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ కూడా పాల్గొన్నారు. అయితే, వీరి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

మరో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ బీజేపీలో చేరిన వారం రోజుల వ్యవధిలోనే షమీ ఈ భేటీ జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే బీజేపీలో చేరిన లెగ్ స్పిన్నర్ చాహల్‌ను పార్టీ తమ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఇప్పుడు షమీ కూడా అదే బాటలో కాషాయ కండువా కప్పుకుంటారా అనే ఆసక్తి నెలకొంది.

గతంలోనూ షమీ రాజకీయ నాయకులతో భేటీ అయిన సందర్భాలు చర్చకు దారితీశాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, సెప్టెంబర్ నెలలో కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరిని షమీ కలిశారు. అయితే, అమ్రోహాలో క్రీడా సదుపాయాల కోసం నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఆయన కలిశారని ఆర్ఎల్డీ అప్పట్లో వివరణ ఇచ్చింది.

36 ఏళ్ల మహమ్మద్ షమీ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ తరపున ఆడారు. 64 టెస్టుల్లో 229 వికెట్లు తీసిన ఆయన, నవంబర్ 6న టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వన్డేలు, టీ20లతో పాటు దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.