దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అందుకున్న విషయం తెలిసిందే. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అత్యున్నత ప్రదర్శన చేసినందుకు గాను షమీకి ఈ అవార్డు దక్కింది. ప్రపంచకప్‌లో 7 మ్యాచులలో 24 వికెట్లు సాధించాడు. భారత క్రికెట్ జట్టులో అర్జున అవార్డు అందుకున్న వారిలో షమీ 58వ క్రికెటర్. అవార్డు అందుకున్న అనంతరం షమీ ఎక్స్‌లో భావోద్వేగ పోస్టు పెట్టాడు. అభిమానులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానాని, దేశం గర్వపడేలా చేసేందుకు తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నిరంతరం శ్రమిస్తానని షమీ పేర్కొన్నాడు.
‘ఈ నిమిషం ఎంతో గర్వపడుతున్నా. రాష్ట్రపతి గారు నన్ను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుతో సత్కరించారు. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి సహకారం అందించిన ప్రహతిఒక్కరికి ధన్యవాదాలు. కెరీర్‌లో ఒడిదొడుకులు చవిచూసిన సమయంలో చాలా మంది అండగా నిలిచారు. కోచ్, బీసీసీఐ, సహచరులు, నా ఫామిలీ, స్టాఫ్ సహకారం వెల కట్టలేనిది. నా అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటా. నా శ్రమను గుర్తించి ఈ అవార్డును అందించినందుకు కృతజ్ఞతలు. దేశం గర్వపడేలా చేసేందుకు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నిరంతరం శ్రమిస్తా’ అని మహమ్మద్ షమీ ట్వీట్ చేశాడు.
Also Read: Virat Kohli: బాబర్ అజామ్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ.. సత్తా చాటిన రోహిత్ శర్మ!
ప్రస్తుతం టీమిండియాలో ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, ఆర్ అశ్విన్, ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాలు అర్జున అవార్డు అందుకున్నారు. టీమిండియా స్టార్ సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్‌లతో పాటు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్, దీప్తి శర్మలు కూడా అర్జున అవార్డు అందుకున్నారు.