Mohammed Shami on Hospital Bed: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆసుపత్రిలో ఉన్నాడు. షమీ కాలి మడమ గాయంకు సోమవారం లండన్‌లో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఈ విషయాన్ని షమీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపాడు. అస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోలను కూడా షమీ షేర్ చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అనంతరం షమీ మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు.
‘కాలి మడమ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. నా కాళ్లపై నేను నడిచి మళ్లీ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు ఎదురుచూస్తుంటాను’ అంటూ మహ్మద్ షమీ ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు షమీ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. శస్త్రచికిత్స కారణంగా ఐపీఎల్ 2024కు షమీ దూరం కానున్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు షమీ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Neil Wagner Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్!
2023 వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ గాయపడ్డాడు. 2023 నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత షమీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. ఇన్ని రోజులు గాయానికి ప్రత్యేకమైన ఇంజెక్షన్లు తీసుకున్నప్పటికీ.. ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. దాంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. జూన్ మాసంలో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 సమయానికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.