CM Stalin: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన ప్రధాని నరేంద్ర మోడీ, తన తమిళనాడు పర్యటనకు కొద్ది గంటల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. “తమిళనాడు ఎన్‌డీఏతోనే ఉంది” అంటూ ధీమా వ్యక్తం చేశారు. అవినీతితో నిండిన డీఎంకే ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే వీడ్కోలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. చెన్నై సమీపంలోని మధురాంతకంలో జరగబోయే ర్యాలీకి ముందు ప్రధాని ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ చేశారు. ఆ రోజు తాను ఎన్‌డీఏ నేతలతో కలిసి ప్రజల ముందుకు వస్తానని పేర్కొన్నారు. ఎన్‌డీఏ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రాంతీయ ఆకాంక్షలకు ఇచ్చిన ప్రాధాన్యం తమిళనాడు ప్రజలను ఆకట్టుకుంటోందని మోడీ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో తమిళనాడులో ఇప్పటివరకు పెద్దగా బలం లేని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ఈసారి గట్టిగా అడుగులు వేయాలని చూస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
READ MORE: Vasant Panchami: వసంత పంచమి ఎందుకు జరుపుకుంటారు..? ప్రత్యేకత ఏంటి..?
ప్రధాని వ్యాఖ్యలకు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. మోడీ చెప్పినట్టుగా తమిళనాడు ఎన్‌డీఏతో లేదని, బదులుగా “ఎన్‌డీఏ చేసిన ద్రోహాలను తమిళనాడు లెక్కపెడుతోంది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎక్స్‌లో చేసిన కౌంట్‌ర్ పోస్టులో కేంద్ర ప్రభుత్వం పదే పదే రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని స్టాలిన్ ఆరోపించారు. స్టాలిన్ తన పోస్ట్‌లో కేంద్రంపై పెండింగ్‌లో ఉన్న అనేక అంశాలను ప్రస్తావించారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద తమిళనాడుకు రావాల్సిన రూ.3,458 కోట్ల విద్యా నిధులు ఇంకా విడుదల కాలేదని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడుకు లోక్‌సభ సీట్లు తగ్గవని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గవర్నర్ వ్యవహార శైలిని తప్పుపడుతూ.. బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తమిళ భాష అభివృద్ధికి సంబంధించిన నిధుల పరిస్థితి ఏంటో చెప్పాలని, ఎంజీఎన్‌రేగా వంటి ఉపాధి పథకాల భవిష్యత్తు ఏమవుతుందో స్పష్టం చేయాలని స్టాలిన్ కోరారు. ఎన్నేళ్లుగా ఆలస్యం అవుతున్న మదురై ఎయిమ్స్ ప్రాజెక్టును ఎద్దేవా చేస్తూ, దాన్ని “ప్రపంచంలోని ఎనిమిదో అద్భుతం”లా మార్చేశారని విమర్శించారు. అంతేకాదు, ప్రకృతి విపత్తుల సహాయ నిధుల ఆలస్యం, హోసూర్ విమానాశ్రయం, కోయంబత్తూరు, మదురై మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆమోదం లేకపోవడం వంటి అంశాల్ని కూడా లేవనెత్తారు. వైద్య ప్రవేశ పరీక్ష నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్‌ను మరోసారి గుర్తు చేశారు. “బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ తమిళనాడును మోసం చేస్తూనే ఉంటే, ప్రజలు కూడా ఆ కూటమిని ఓడిస్తూనే ఉంటారు” అని స్టాలిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. తన పోస్ట్‌కు #NDABetraysTN అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.
