NTV Telugu Site icon

Amit Shah: మయన్మార్‌ బోర్డర్‌లో 1,643 కిలోమీటర్ల కంచె ఏర్పాటు

Abid

Abid

మయన్మార్‌ సరిహద్దు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌- మయన్మార్‌ల సరిహద్దులో మొత్తం 1,643 కిలోమీటర్ల మేర కంచెను (Fencing) నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) వెల్లడించారు. కట్టుదిట్టమైన నిఘాను సరిహద్దు వెంబడి ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సరిహద్దుల్లో భద్రతకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

 

ఇరు దేశాల మధ్య సరిహద్దును పూర్తిగా కవర్‌ చేస్తూ 1,643 కిమీ పొడవునా కంచెను నిర్మిస్తున్నట్లు అమత్ షా వెల్లడించారు. మణిపుర్‌లోని మోరేలో ఇప్పటికే 10 కిలోమీటర్ల మేర కంచె వేశారని… హైబ్రిడ్ నిఘా వ్యవస్థ ద్వారా మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ల్లో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్‌ ఏర్పాటుకు పైలట్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మణిపుర్‌లో సుమారు 20 కి.మీ. మేర పనులకు కూడా ఆమోదం లభించిందని.. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని అమిత్‌ షా ట్వీట్‌ ద్వారా వెల్లడించారు.

 

సరిహద్దుల్లో ఏఏ రాష్ట్రాలంటే..
ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లు మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటివరకు సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే ఈ మధ్య ఆ దేశం నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మణిపుర్‌ సంక్షోభం, మయన్మార్‌లో అంతర్యుద్ధంతో పరిస్థితులు ప్రభావితమయ్యాయి. ఇలాంటివి అరికట్టేందుకు ఆ దేశ సరిహద్దు వెంబడి కంచె వేస్తామని అమిత్‌ షా ఇప్పటికే ప్రకటించారు.