PM Modi Diwali 2025: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతుండగా, గోవాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నావికాదళ సిబ్బందితో 2025 దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని గోవా నావికా స్థావరంలో నావికాదళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీతో దీపావళి జరుపుకోవడం ఒక గౌరవం” అని అన్నారు. “ఒక వైపు నాకు సముద్రం ఉంది, మరోవైపు వీర సైనికుల అపారమైన బలం ఉంది. సముద్ర జలాలపై సూర్యకిరణాల ప్రకాశం, వీర సైనికులు వెలిగించిన దీపావళి దీపాలను సూచిస్తుంది” అని ప్రధాని మోడీ అన్నారు. ఇదే వేదికపై నుంచి ప్రధాని పాకిస్థాన్‌కు బలమైన సందేశం పంపారు.
READ ALSO: Gannavaram TDP: గన్నవరం టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు!
మీతో దీపావళి జరుపుకోవడం అదృష్టం..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. “ఈ దీపావళి పండుగను మీతో జరుపుకోవడం నిజంగా నా అదృష్టం” అని అన్నారు. “ఐఎన్ఎస్ విక్రాంత్‌లో నేను గడిపిన రాత్రిని మాటల్లో వర్ణించడం కష్టం. ఈ నౌకలు ప్రత్యేకమైనవి, కానీ మీ ధైర్యం మాత్రమే వాటికి ప్రత్యేకతను తెస్తుంది. ఇనుముతో తయారు చేసిన ఓడలో మీరు ఎక్కినప్పుడు మాత్రమే, దానికి నిజమైన గుర్తింపు సొంతం చేసుకొని చరిత్రలో నిలిచిపోతుంది” అని చెప్పారు. సైనికుల కృషి, అంకితభావం చాలా గొప్పవని ప్రధాని కొనియాడారు. ఈ దీపావళి తనకు ప్రత్యేకంగా మారిందని ఆయన అన్నారు. దేశ ప్రజలకు ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ప్రధాని దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
పాక్‌కు హెచ్చరికలు..
భారతదేశ మూడు సాయుధ దళాల మధ్య అసాధారణ సమన్వయం పాకిస్థాన్‌ను రికార్డు సమయంలో లొంగిపోయేలా చేసిందని ప్రధాని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. “మన సాయుధ దళాల వీర సైనికులకు మరోసారి నేను సెల్యూట్ చేస్తున్నాను. ముప్పును గుర్తించినప్పుడు దృఢంగా నిలబడి పోరాడిన దేశానికే ప్రయోజనం ఉంటుంది. మన దళాలు నిజంగా ప్రభావవంతంగా ఉండాలంటే, వారు బలంగా, సామర్థ్యంతో, స్వావలంబనతో ఉండాలి” అని పిలుపునిచ్చారు. కొన్ని నెలల క్రితం విక్రాంత్ అనే పేరు పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చిన విషయాన్ని మనం చూశామని ప్రధాని చెప్పారు. శత్రువుల ధైర్యాన్ని బద్దలు కొట్టగల పేరు ఐఎన్ఎస్ విక్రాంత్, నేడు ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశం స్వావలంబనకు, మేడ్ ఇన్ ఇండియాకు శక్తివంతమైన చిహ్నంగా మారిందని పేర్కొన్నారు. సముద్రాల గుండా దూసుకుపోతున్న స్వదేశీ ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ సైనిక సామర్థ్యాలకు ప్రతిబింబంగా నిలిచిందని చెప్పారు.
ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌక..
ప్రస్తుతం సగటున ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామిని నావికాదళంలోకి చేర్చుతున్నామని ప్రధాని మోడీ చెప్పారు. బ్రహ్మోస్, ఆకాశ్ వంటి భారత క్షిపణులు ఆపరేషన్ సింధూర్‌లో తమ సామర్థ్యాలను నిరూపించుకున్నాయని వెల్లడించారు. గత దశాబ్దంలో దేశ రక్షణ ఎగుమతులు 30 రెట్లు పెరిగాయని, ఈ విజయంలో రక్షణ స్టార్టప్‌లు, స్వదేశీ రక్షణ యూనిట్లు ప్రధాన పాత్ర పోషించాయని వివరించారు.
ముగింపు అంచున మావోయిస్టులు..
2014 కి ముందు దేశవ్యాప్తంగా దాదాపు 125 జిల్లాలు మావోయిస్టు హింసకు గురయ్యాయని ప్రధానమంత్రి చెప్పారు. గత 10 ఏళ్లుగా కృషి చేయడం వల్ల ఈ సంఖ్య నేడు కేవలం 11 జిల్లాలకు పరిమితం అయ్యిందని వెల్లడించారు. ఈ 11 జిల్లాల్లో కూడా వారి ప్రభావం కనిపించే జిల్లాలు కేవలం మూడు మాత్రమే అని స్పష్టం చేశారు. మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన 100 కి పైగా జిల్లాలు ఈ ఏడాది దీపావళిని ఘనంగా జరుపుకుంటూ మొదటిసారిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నాయని మోడీ చెప్పారు. దేశ భద్రతా దళాల పరాక్రమం, ధైర్యం కారణంగా ఇటీవలి భారతదేశం మరో ప్రధాన మైలురాయిని సాధించిందని, అది మావోయిస్టు ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అని పేర్కొన్నారు. నేడు దేశం నక్సలైట్-మావోయిస్ట్ ఉగ్రవాదం నుంచి విముక్తి అంచున ఉందని స్పష్టం చేశారు.
READ ALSO: Saad Rizvi Missing: పాక్‌లో పానిక్! సడెన్‌గా మిస్ అయిన టీఎల్‌పీ బాస్..
