Moda Kondamma Jatara: మన్యం దేవత.. గిరిజనుల కల్పవల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం… ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం.. పాడేరు మోదకొండమ్మ తల్లి. అమ్మవారి మూడురోజుల ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రెండవ గిరిజన జాతరగా పాడేరు మోదకొండమ్మ జాతర పేరొందింది. రాష్ట్ర విభజన అనంతరం మోదకొండమ్మ జాతర ఏపీలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి గిరిజన జాతరగా గుర్తింపు పొందింది పాడేరు మోదకొండమ్మ ఉత్సవం..! మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకోసం భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఏపీలో జరిగే గిరిజనుల పెద్దపండుగ ఇదే కావడంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
నేటి నుంచి ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. జాతర కోసం అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ జాతర మూడు రోజుల పాటు జరగనుంది. ఏజెన్సీలో 14వందల మంది పోలీస్ బలగాలు మోహరించారు. మూడు రోజులు జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలోకి వాహనాల అనుమతిని నిరాకరించారు. భారీ వాహనాలు ఘాట్ కింద వరకు పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తొలిరోజు ఆదివారం అమ్మవారి ఆలయం మెట్టినిల్లు నుంచి బయలుదేరుతారు. పాడేరు ఆలయం నుంచి శతకం పట్టు పుట్టింటికి డప్పుల వాయిద్యాలతో అమ్మవారి విగ్రహం తీసుకెళ్తారు. పాదాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి శతకం పట్టు వద్ద ప్రతిష్టిస్తారు. మూడు రోజుల పాటు శతకం పట్టు వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఆ తరువాత విగ్రహాలను తీసుకొచ్చి గుడికి చేరుస్తారు. అక్కడితో జాతర ముగుస్తుంది.. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల నుంచి గిరిజనులు, భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
Read Also: Kondagattu: హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు.. మాలదారులతో కిటకిటలాడుతున్న ఆలయం
రాష్ట్రంలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన గిరిజన జాతర మోదకొండమ్మ జాతర. రాష్ట్ర ప్రభుత్వం 2014లో రాష్ట్ర జాతరగా గుర్తించి కోటి రూపాయల నిధులు విడుదల చేస్తుంది. ఉత్సవాల్లో గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన, మంచినీటి వసతులు భక్తులకు కల్పిస్తారు. సాంప్రదాయ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. జాతరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 14వందల మందిని ఉత్సవాల కోసం రంగంలోకి దింపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు హిట్ లిస్ట్ లో ఉన్న వారిని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత అనుభవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొత్త జిల్లాగా ఏర్పడిన తరువాత అల్లూరి జిల్లాలో పెద్ద పండుగ కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.