NTV Telugu Site icon

MLC Sheikh Sabji: అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అంత్యక్రియలు పూర్తి

Mlc Shiekh Sabji

Mlc Shiekh Sabji

MLC Sheikh Sabji: ఏలూరులో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఉపాధ్యాయ ఉద్యమ నేత, శాసనమండలి సభ్యులు షేక్‌ సాబ్జీ అంతిమయాత్ర ఆదివారం ఏలూరులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏలూరుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు సాబ్జీకి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ ఉత్తర్వులు జారీ చేయగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. సాబ్జీ కుమార్తె ఆస్రిఫా అమెరికా నుంచి ఆదివారం ఉదయం ఏలూరుకు రావడంతో సాబ్జీ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆశ్రం ఆస్పత్రి నుంచి నేరుగా సాబ్జీ భౌతికకాయాన్ని ఏలూరులోని యూటిఎఫ్‌ జిల్లా కార్యాలయానికి తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉంచి, అనంతరం ప్రజల సందర్శనార్థం కలెక్టరేట్‌ ఏదురుగా ఉన్న ఇండోర్‌ స్టేడియానికి తీసుకెళ్లారు. ఈ అంతిమ వీడ్కోలులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో పాటు సీపీఎం నాయకులు, ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, కె.లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం, యూటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు, సిఐటియు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు పలు ప్రజాసంఘాలకు చెందిన నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరంలో ఆయన మృతదేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Read Also: Nagababu: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదు.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు

కొనసాగుతున్న విచారణ
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆయన మరణంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసిన విషయం విదితమే. షేక్ సాబ్జీ మరణం ప్రమాదం కాదు, హత్య అంటూ ఆయన కొడుకు, సోదరుడు ఆరోపించారు. రాబోయే ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు మద్దతుగా ఉండే ఎమ్మెల్సీని కావాలనే అంతమొందించారని వారు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న డ్రైవర్‌తో పాటు మరొకరినిఆకివీడు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ కారును ఢీకొట్టిన కార్ డ్రైవర్ స్వామిని పోలీసులు విచారిస్తున్నారు. నిర్లక్ష్యం, నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావించిన పోలీసులు.. టెక్నికల్ ఎవిడెన్స్‌లు సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు.