Site icon NTV Telugu

MLC P.Venkatarami Reddy : నేను ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదు

Venkataramireddy

Venkataramireddy

నన్ను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్న తీరు సిగ్గు చేటు అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి వెంకట్రామ రెడ్డి (IAS Retd) అన్నారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని నన్ను డబ్బులు తరలించినట్టు కథ అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి మీద వేయడమే. ఆ సమయంలో నేను ఎమ్మెల్సీగా పరోక్ష రాజకీయంలో ఉన్న విషయం అందరికి విదితమే అని ఆయన అన్నారు. ప్రస్తుత ఎంపి ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి బిజెపి, కాంగ్రెస్ రెండు పార్టీలు చేతులు కలిపి నన్ను ఓడించాలని దుష్ట పన్నాగం పన్నుతున్నాయి. సిద్ధాంతాలు, విలువలు గాలికి వదిలి ప్రజల్ని మభ్యపెట్టే స్థాయికి దిగజారాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగిగా, కలెక్టర్ గా ప్రజలకు నిజాయతీగా సేవలు అందించాను. ప్రజా సేవకుడిగా ఇంకా ఎక్కువ సేవలు అందించడానికి ప్రత్యక్ష రాజకీయం లోకి వచ్చానని ఆయన తెలిపారు.

అంతేకాకుండా..’పేద విద్యార్థులకు విద్య అందించేందుకు, స్కిల్ డెవలపమెంట్ కార్యక్రమాల కోసం వంద కోట్లతో పివిఆర్ ట్రస్ట్ ఏర్పాటు ప్రకటించాను. ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మించి సేవలు అందిస్తా అని మాట ఇచ్చాను. నేను ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదు. నీచ రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. ఈ విషయం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. ప్రజల అభిమానం మెండుగా ఉన్న నాపై విమర్శలు చేయడానికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో బిజెపి, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయి. నా మనో స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నా వైపు ఉన్నారు. నా మంచితనం ప్రజలకు తెలుసు. ఇప్పటికైనా నా మీద తప్పుడు వార్తల పుకార్లు వ్యాప్తి చేయడం మాని విధానాలు సిద్ధాంతాల పరంగా ఎన్నికల్లో తలపడదామని మెదక్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు విజ్ఞప్తి చేస్తున్నా..’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version