జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ప్రజా పాలనను కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ తాటివర్తి జీవనరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం అవకతవకలపై న్యాయ విచారణ చేపడుతామన్నారు. కేసీఆర్ ను కాపాడేందుకు బీజేపీ సీబీఐ విచారణ చేపట్టాలంటోందని ధ్వజమెత్తారు. తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం కోసం వచ్చే బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలపై పారదర్శకంగా వాస్తవాలను వెలికితీసేందుకే న్యాయవిచారణ చేపట్టాలన్నారు జీవన్ రెడ్డి. లిక్కర్ స్కాం విచారణను ప్రజలు గమనించారని, సిసోడియా నుండి మొదలుకొని అరవింద్ కేజ్రివాల్ ను విచారణ చేవడుతున్నారన్నారు.
ఎమ్మెల్సీ కవిత అంశంలో ఎందుకు నాన్చుతున్నారని ఆయన ప్రశ్నించారు. కవితపై అన్ని ఆధారాలున్నాయని బీజేపీ నాయకులే చెబుతున్నారని, కవితపై ఉన్నపై విచారణ తొక్కిపెట్టినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ తొక్కిపెట్టేందుకు, కేసీఆర్ ను కాపాడేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ కొమ్ము కాసేందుకు బీజేపీ ఏవిధంగా వ్రయత్నం చేస్తుందో న్యాయ కోవిదులు, మేధావులు, తెలంగాణ సమాజం ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.