మేజర్ క్రికెట్ లీగ్‌లో భాగంగా.. ఎంఐ న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విద్వంసకర మ్యాచ్‌గా నిలిచింది. అమెరికాలోని ఓక్లాండ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారిగా ఒకే టీ20 మ్యాచ్‌లో 50కి పైగా (మొత్తం 51) సిక్సర్లు నమోదయ్యాయి. ఎంఐ న్యూయార్క్ 29 సిక్సర్లు, వాషింగ్టన్ ఫ్రీడమ్ 22 సిక్సర్లు బాదాయి. దీనితో ఐపీఎల్ 2024 (KKR vs PBKS), సీపీఎల్ 2024 లలో నమోదైన 42 సిక్సర్ల రికార్డు బద్దలైంది.
ఒకే టీ20 ఇన్నింగ్స్‌లో 29 సిక్సర్లు బాదిన ‘ఎంఐ న్యూయార్క్’, 2025 లో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ (28 సిక్సులు) నెలకొల్పిన రికార్డును అధిగమించింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. నికోలస్ పూరన్ (MI NY).. 33 బంతుల్లో 106 పరుగులు (13 సిక్సర్లు), ఆండ్రీస్ గౌస్ 51 బంతుల్లో 132 పరుగులు (12 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ 48 బంతుల్లో 110 పరుగులు (9 సిక్సర్లు) సెంచరీలు నమోదు చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ 9 వికెట్లకు 266 పరుగులు చేయగా, వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసి రికార్డు విజయాన్ని అందుకుంది.
ఐపీఎల్ 2026 లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ సాధించిన 265 పరుగుల రన్ చేజ్ రికార్డును వాషింగ్టన్ ఫ్రీడమ్ బద్దలు కొట్టింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆటగాళ్లు ఆండ్రీస్ గౌస్, స్టీవ్ స్మిత్ మూడో వికెట్‌కు 241 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది టీ20 చరిత్రలో ఏ వికెట్‌కైనా సంయుక్తంగా రెండో అత్యధిక భాగస్వామ్యం. వీరు ఐపీఎల్ 2016 లో గుజరాత్ లయన్స్‌పై విరాట్ కోహ్లీ – ఏబీ డివిలియర్స్ (229 పరుగులు) నెలకొల్పిన రికార్డును దాటేశారు.

