NTV Telugu Site icon

MLA Seethakka : మోడీ 10 లక్షల షూట్ వేసుకుంటాడు.. రాహుల్ కి ఇల్లే లేదు

Seethakka

Seethakka

MLA Seethakka : గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం, బహిరంగ సభకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొననున్నారు. మంగళవారం వరకు ఈ సభకు ఎలాంటి అనుమతులు పోలీసులు ఇవ్వకపోవడంతో మండలంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. యువజన సంఘాల నాయకుడు చొక్కారావు పల్లె గ్రామ ఉపసర్పంచ్ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి తన అనుచరులతో భారీ సంఖ్యలో చేరికలు ఉండడంతో ఈ సభ పై ఉత్కంఠ నెలకొంది.

Read Also: IPL 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సీతక్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గ్రామంలో సభ పెట్టుకోవడానికి హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు. ఇంత నియంతృత్వమా…? నియంతలు అందరూ కాలగర్భంలో కలిసిపోయారని సీతక్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి… సబ్సిడీలు ఎత్తివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడిన మాటలు “ఛత్తీస్ ఘడ్ లో 2600 వరికి మద్దతు ధర ఉంది… తెలంగాణలో ఎంత ఉంది?. దళిత బంధు అని దళితులను ఉద్ధరించింది లేదు.. నియోజకవర్గానికి 100మందికి ఇస్తున్నారు. కష్టపడి చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా పరీక్షా పేపర్లు గంపగుత్తగా అమ్ముకుంటున్నారు.. కేటీఆర్ నాకు సంబంధం లేదని అంటున్నారు.

Read Also: IPL 2023 : చరిత్ర సృష్టించిన ధోని.. సీఎస్‌కే కెప్టెన్‌గా 200వ మ్యాచ్‌

ఈ రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నారు? వేరే రాష్ట్రం వారు పాలిస్తున్నారా?.. పదో తరగతి పేపర్ లీక్ అయితది.. బండి సంజయ్ అలా వెళ్లి ఇలా బయటకు వస్తాడు.. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే.. ఉపాధిహామీ పథకం కాంగ్రెస్ పెట్టింది… దాని పుణ్యమే ఆ నిధుల వల్లనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోంది. రసమయి కేసీఆర్ పాలన ఆహా ఓహో అంటూ పాటలు పాడుతున్నాడు… ఆయన నియోజకవర్గంలో రోడ్లు లేవు..మోడీ 10 లక్షల షూట్ వేసుకుంటాడు… రాహుల్ కి ఇల్లే లేదు.. వారి నిజాయితీ ఇది..మీటింగ్ కోసం హైకోర్టు కి పోవాలా రసమయి… నీ నియంతృత్వం సాగదు.. తెలంగాణ ఉద్యమమే అణిచివేతకు వ్యతిరేకంగా సాగింది” అంటూ ఎమ్మెల్యే సీతక్క రెండు ప్రభుత్వాలపై అక్కసు వెళ్లబోసుకున్నారు.