NTV Telugu Site icon

MLA Rapaka Varaprasad: రాజోలు సీటు.. ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు

Rapaka

Rapaka

MLA Rapaka Varaprasad: డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు (ఎస్సీ రిజర్వుడు) వైసీపీ సీటు విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పునరాలోచించాలంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఖచ్చితమైన సర్వే నిర్వహించి టిక్కెట్ కేటాయించాలంటూ ఎమ్మెల్యే రాపాక చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి.. మలికిపురం సెంటర్‌లో వైఎస్సార్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ఈ నియోజక వర్గంలో రెండు సార్లు ఓడిపోవడంతో కార్యకర్తలు మనోవేదనతో వున్నారని అన్నారు. ఈసారి ఎలాగైనా వైసీపీ గెలిచే అభ్యర్థికి టికెట్ కేటాయించాలని ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నన్ను అమలాపురం ఎంపీగా పోటీ చేయమని పార్టీ అధిష్టానం చెప్పిందని.. పార్టీ అధిష్టానం ఎంపీగా పోటీ చేయమన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నా చేయడానికి సిద్ధంగా వున్నట్టు ఎమ్మెల్యే రాపాక చెప్పారు.

Read Also: Kamal Haasan: దేశాన్ని విభజించేందుకే సీఏఏని తెచ్చింది.. కమల్ హాసన్ ఫైర్..

అయితే, ఎమ్మెల్యే రాపాక సమక్షంలోనే రాజోలు సీటు మార్చకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి సిద్ధమని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు. గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు రాపాకకు మద్దతుగా రాజీనామాలు చేశారు. రెండు రోజుల క్రితమే రాపాకను అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జిగా నియమించారు.. మరోవైపు.. మాజీ మంత్రి, టీడీపీ రాజోలు ఇంఛార్జికి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు వైసీపీ టిక్కెట్ ఇచ్చారు. అయితే, వైసీపీలో కొందరు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. టిక్కెట్లు ఖరారు అయ్యాక గొల్లపల్లి, రాపాక కూడా కలుసుకుని మాట్లాడుకున్నారు కూడా. అంతకుముందు దశాబ్ద కాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, వీరిద్దరూ వైసీపీలో ఒక్కటయ్యారు. మా మధ్య ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని పార్టీ శ్రేణులకు కూడా స్పష్టం చేశారు.

Read Also: Health Tips: అన్నం తిన్న వెంటనే నీరు తాగుతున్నారా?..ఈ నిజం తెలిస్తే అసలు తాగరు..

అంతలోనే వైసీపీ రాజోలు నియోజకవర్గంలోని కొందరు నాయకులు గొల్లపల్లి సూర్యారావు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, రాపాకకే రాజోలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్లు చేస్తూ రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మలికిపురంలో జరిగిన వైసీపీ ఆవిర్భావ సభలో రాపాక చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన జీవిత కాలంలో ఎన్నో పోరాటాలు చేశానని సీటు విషయంలో ఇక పోరాటం చేసే ఓపిక తనకుకు లేదంటూ తన మనోగతాన్ని ఎమ్మెల్యే రాపాక స్పష్టం చేశారు. ఎక్కడా సీటు లేదు నువ్వు సేవ చెయ్యి అంటే సేవ చెయ్యడానికి కూడా తాను సిద్ధం అన్నారు ఎమ్మెల్యే రాపాక. ఈ వ్యాఖ్యలపై వైసీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.