Site icon NTV Telugu

MLA Putta Sudhakar: తాగునీటి సమస్యకు పరిష్కారంగా అలగనూరు రిజర్వాయర్..!

Mla Putta Sudhakar

Mla Putta Sudhakar

MLA Putta Sudhakar: కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, నందికొట్కూరు ఎమ్మెల్యే జై సూర్యలతో కలిసి అలగనూరు బ్యాలెన్స్డ్ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కడప జిల్లాలో తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చగలిగే శక్తి ఉన్న ప్రాజెక్టు అలగనూరేనని పేర్కొన్నారు. 1985లో స్వర్గీయ ఎన్టీఆర్ ఈ రిజర్వాయర్‌కు మూడుకోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. 3500 ఎకరాల విస్తీర్ణంలో డ్యాం నిర్మాణాన్ని ఆ రోజు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో 59.76 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు 2004లో పూర్తి చేయబడింది. 2005లో 2.6 టీఎంసీల నీటిని నింపి ఉపయోగంలోకి తీసుకురాగలిగారు.

Read Also: Thiruvananthapuram: F-35 యుద్ధవిమానం అత్యవసర ల్యాండింగ్..!

కానీ, 2017లో ఈ ప్రాజెక్టుకు గండి పడింది. మరమ్మత్తుల కోసం నిధులు మంజూరయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐదు లేదా ఆరు కోట్లు ఖర్చు చేసి ఉంటే అప్పటికే ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ అది పూర్తిచేయకుండా కొత్తగా పనులు ప్రారంభించినట్లు చూపించి వదిలేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అలగనూరు ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం అసెంబ్లీలో లేవనెత్తిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, మంత్రి ఛాంబర్ లో అధికారులతో కలిసి ప్రాజెక్టుపై వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం 36 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తే నీటిని నిల్వ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి క్లియరెన్స్ కూడా వస్తుందని తెలిపారు.

Read Also: Temba Bavuma: ఛీ.. ఛీ.. ఇక మారరా మీరు.. ‘చోక్’ అంటూ స్లెడ్జింగ్‌.. దక్షిణాఫ్రికా కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!

ఈ ప్రాజెక్టు ద్వారా కేసీ కెనాల్‌కు 92,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఇరుకారు పంటల సాగు కోసం రైతులకు భరోసా కలిగించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తైతే దాదాపు లక్ష ఎకరాలకు ఎకరానికి రూ. 25,000 ఆదాయం వస్తే మొత్తం రూ. 250 కోట్ల ఆదాయం రైతులకు లభిస్తుందని అంచనా వేశారు. ఇది కాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా మత్స్యకారులకు సుమారు ఐదు నుండి ఆరు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇసుక కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్ ప్రభుత్వం రైతుల కోసం మాత్రం ఈ ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు కావలసిన ప్రతిదాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ ప్రాజెక్టును పూర్తిచేసి రైతాంగానికి నీరు అందించేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తామని, ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది నీటిని నింపేందుకు ప్రయత్నిస్తామని పుట్టా సుధాకర్ యాదవ్ హామీ ఇచ్చారు.

Exit mobile version