MLA Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడం పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అనుసరించిన పద్ధతి సరైంది కాదని సూచించింది. కేసు ఆడియోలు, వీడియోలను ఆయన ఎలా న్యాయమూర్తులకు పంపిస్తారని ప్రశ్నించింది. విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అరవింద్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలంగాణ సర్కార్ తరపున న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. సీబీఐ చేతిలోకి కేసు వెళ్తే ఇప్పటి వరకు చేసిన విచారణ అంతా పక్కదారి పడుతుందని ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ లూత్రా, దుష్యంత్ దవేలు వాదనలు వినిపించారు. ఈ కేసులో ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారని వాదించారు.
Read Also: Tragedy: పెళ్లైన ఏడాదికే బస్సు రూపంలో మృత్యువు.. భార్యను పుట్టింటినుంచి తీసుకొస్తుండగా
కోర్టు సమయం ముగియడంతో సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తదుపరి విచారణపై సందిగ్ధత నెలకొంది. శనివారం నుంచి సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు కావడంతో ఈ నేపథ్యంలో శుక్రవారమే విచారణ చేపట్టాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. కానీ, సాధ్యం కాదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్‌ల ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలో కేసును సీజేఐ ధర్మాసనానికి రిఫర్ చేసింది. తదుపరి విచారణపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ గవాయ్ ధర్మాసనం వెల్లడించింది.