పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మీడియా మిత్రులకు సరైన భోజనం కూడా పెట్టలేని ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేశారు. శాసన సభ్యుడుగా తనకే భద్రత లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అని హుజురాబాద్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. గురువారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
‘సభలో శాంతి భద్రతలపై మాట్లాడితే మైక్ కట్ చేశారు. నా ఇంటిపై ఎమ్మెల్యే గాంధీతో పాటు రౌడీలు దాడి చేశారు. నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. సైబరాబాద్ డీసీపీ, మాదాపూర్ ఏసీపీ స్వయంగా రౌడీ షీటర్లను తీసుకొచ్చి హత్య ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఏడాది గడుస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. శాసన సభ్యుడుగా నాకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?. సైబరాబాద్ డీసీపీ, మాదాపూర్ ఏసీపీని సస్పెండ్ చేయాలి. నన్ను హత్య చేసేందుకు వచ్చిన గాంధీపై 307 కేసు బుక్ చేశారు. ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?. నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కంప్లైంట్ చేస్తే.. ఉల్టా నా పైనే కేసు పెట్టి బలవంతంగా మా ఇంటి డోర్లు పగలగొట్టి నన్ను తీసుకెళ్లారు’ అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
‘పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఉప ఎన్నికలు రావని ప్రకటన చేశారు. ఏప్రిల్ 2న సీఎం వ్యాఖ్యలను సుప్రీం దృష్టికి తీసుకెళ్తాం. పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నా నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి. మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలి. సుంకేశాల కన్‌స్ట్రక్షన్ చేసిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలి. కాలేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాలకు కేసీఆర్ సాగునీరు అందించారు. ఈ ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు.. వెంటనే వారికి బిల్లు చెల్లించాలి. అసెంబ్లీలో మీడియా మిత్రులకు సరైన భోజనం కూడా పెట్టలేని ప్రభుత్వం ఇది’ అని హుజురాబాద్ ఎమ్మెల్యే మండిపడ్డారు.