NTV Telugu Site icon

MLA Kapu Ramachandra Reddy: కాంగ్రెస్‌ వైపు వైసీపీ ఎమ్మెల్యే చూపు..! రఘువీరారెడ్డితో సుదీర్ఘ చర్చలు

Kapu

Kapu

MLA Kapu Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీట్లు మార్పు, చేర్పుల వ్యవహారం చిచ్చు పెడుతోంది.. పలువురు సిట్టింగ్‌లు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అయ్యారనే ప్రచారం సాగుతోంది.. ఇక, ఈ మధ్యే సీఎం వైఎస్‌ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి.. వైసీపీ బైబై చెప్పడం ఖాయమనిపిస్తోంది.. పార్టీ మార్పుపై ఈ రోజు స్పష్టత ఇవ్వనున్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. రాయదుర్గంలో కాపు నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. అక్కడే భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నారు.. నిన్న మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డిని కలిసిన రామచంద్రారెడ్డి.. రెండు గంటల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు.. మడకశిర మండలం నీలకంఠాపురంలోని రఘువీరా నివాసంలో రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, కోడలు అలేఖ్య కలిసి చర్చించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఈ రోజు కాపు స్పష్టత ఇస్తారనే చర్చ సాగుతోంది.

Read Also: MLA Kolusu Parthasarathy: మాజీ మంత్రి, ఆ వైసీపీ ఎమ్మెల్యే రూటు ఎటు..? సైకిల్‌ ఎక్కుతారా?

ఇటీవలే వైసీపీ అధిష్టానంపై ధిక్కార సర్వం వినిపించిన కాపు.. ఇక ఆ పార్టీలో కొనసాగడం కష్టమని చెబుతున్నారు. రాయదుర్గం , కళ్యాణదుర్గం నియోజకవర్గాలలో బరిలో ఉంటామని ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డి , సతీమణి భారతి ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన ఏ పార్టీలో చేరతారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తురు అనే చర్చ సాగుతోంది. రామచంద్రారెడ్డి.. కాంగ్రెస్‌ వైపు ఆసక్తిగా చూస్తున్నారని ప్రచారం సాగుతోంది.. కాగా, తనకు సీటు ఇవ్వకపోవడంపై ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు కాపు రామచంద్రారెడ్డి, మీకు గుడ్‌ బై అంటూ సీఎం క్యాంపు కార్యాలయానికి సెల్యూట్ చేసి వెళ్లిపోయారు.. అంతే కాదు వైఎస్‌ జగన్‌ని నమ్ముకుని వచ్చినందుకు తమ జీవితాలు నాశనం అయ్యాం.. జగన్‌ను నమ్మి ఆ కుటుంబం వెంట నడిచాం.. ఇప్పుడు తమకు అన్యాయం చేశారని మండిపడిన విషయం విదితమే. అయితే, ఏపీలో పునర్‌ వైభవం కోసం అడుగులు వేస్తోన్న కాంగ్రెస్‌ పార్టీలోనే ఆయన చేరతారా? రఘువీరారెడ్డి ఎలాంటి హామీ ఇచ్చారు.. ఈ రోజు రాష్ట్ర పర్యటనకు రానున్న కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణికం ఠాకూర్‌తో ఏమైనా చర్చలు జరిపారు.. ఇలాంటి అంశాలపై కాసేపట్లో క్లారిటీ రానుంది.