MK Stalin: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన స్టాలిన్..

Mkstalin

Mkstalin

MK Stalin: డీలిమిటేషన్ బిల్లు (Delimitation bill) విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని డీఎంకే (DMK) అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే (TVK) పార్టీ బీజేపీతో (BJP) చేతులు కలపబోతోందంటూ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే స్టాలిన్ ఈ క్లారిటీ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లతో (Women’s reservation) ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లును తాము బలపరుస్తామన్న ప్రచారంలో నిజం లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు. రెండు కీలక డిమాండ్లపై తమ పార్టీ గట్టిగా నిలబడిందని ఆయన నొక్కి చెప్పారు.

లోక్‌సభ (Lok Sabha) మొత్తం సీట్ల సంఖ్య పెరిగినా, తమిళనాడుకు (Tamil Nadu) ప్రస్తుతం ఉన్న 7.18 శాతం సీట్ల వాటా తగ్గకూడదన్నది మొదటి డిమాండ్. 1971 జనాభా లెక్కల (1971 Census) ఆధారంగా రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటు అలాగే ఫ్రీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రెండు డిమాండ్లపై డీఎంకే (DMK) వెనక్కి తగ్గదని స్టాలిన్ అన్నారు. తమ వైఖరిలో మార్పు లేదని, రాజీ పడే ప్రశ్నే లేదని ఆయన తేల్చేశారు. డీలిమిటేషన్ వల్ల వచ్చే నష్టాలపై మొదట గొంతు విప్పింది డీఎంకేనే అని స్టాలిన్ గుర్తు చేశారు. మీడియాలో వచ్చే వదంతులు కానీ, వెన్నుపోటు పొడిచేవారి అరుపులు కానీ తమ సంకల్పాన్ని కదిలించలేవన్నారు. పదవుల కోసం సిద్ధాంతాలను వదిలేసిన వారు దీన్ని గుర్తుంచుకోవాలన్నారు.

ఇదిలా ఉండగా.. నవంబర్ 30 నుంచి పార్లమెంట్ (Parliament) ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ వేడెక్కింది. 2029 నాటికి మహిళా కోటా (Women’s quota) చట్టం అమలు చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ బిల్లును మళ్లీ తీసుకురానుంది. దీనివల్ల లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్య 850కి పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి గత ఏప్రిల్‌లో రాజ్యాంగ 131వ సవరణ బిల్లును పాస్ చేయడానికి చేసిన ప్రయత్నాన్ని విపక్షాలు కలిసి అడ్డుకున్నాయి. ఈసారి దక్షిణాది రాష్ట్రాల (Southern states) ఆందోళన తగ్గించేలా కేంద్రం కొత్త ఫార్ములాతో వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచి, ప్రస్తుత నిష్పత్తిని అలాగే ఉంచేలా కొత్త బిల్లు ఉండొచ్చని సమాచారం. ఇలా చేస్తే ఈ ప్రక్రియను జనాభా లెక్కలతో ముడిపెట్టాల్సిన అవసరం ఉండదు.