MK Stalin: “రాజీపడే ప్రసక్తే లేదు”.. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..

Mk Stalin

Mk Stalin

MK Stalin: డీలిమిటేషన్ (Delimitation) విషయంలో ఇండియా కూటమి (INDIA bloc) ప్రయత్నాలకు ఎంకే స్టాలిన్ (MK Stalin) బ్రేక్ వేశారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill) విషయంలో తమ పార్టీ వైఖరిని డీఎంకే (DMK) అధినేత ఎంకే స్టాలిన్ ఆదివారం మరోసారి స్పష్టం చేస్తూ, తమిళనాడు (Tamil Nadu), అక్కడి ప్రజల ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. ప్రతిపాదిత చట్టాన్ని వ్యతిరేకించాలని డీఎంకే అధినేతను కోరడానికి కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇతర సీనియర్ ఇండియా కూటమి నేతలతో కలిసి చెన్నై (Chennai) బయలుదేరిన నేపథ్యంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ (Lok Sabha) కూర్పులో మార్పులు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్రం తీసుకురావాలనుకుంటున్న అంశాలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నాల మధ్య ఈ మాటల యుద్ధం జరుగుతోంది.

తాను, ఇతర సీనియర్ ఇండియా కూటమి నేతలు చెన్నైలో స్టాలిన్‌ను కలిసి, ప్రతిపాదిత బిల్లును వ్యతిరేకించాలని కోరతామని రాహుల్ గాంధీ ఎక్స్ (X) వేదికగా ఒక పోస్ట్‌లో తెలిపారు. లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచడం వల్ల ప్రజాస్వామ్యం (Democracy) బలహీనపడే ప్రమాదం ఉందని, దీనివల్ల బీజేపీ (BJP), ఆర్‌ఎస్ఎస్ (RSS) తమకు అనుకూలంగా భారత ఎన్నికల మ్యాప్‌ను (Electoral map) మార్చుకునే అవకాశం లభిస్తుందని ఆయన వాదించారు. తమిళ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా స్టాలిన్ గత కొన్నేళ్లుగా ఎలా నిలబడ్డారో కూడా రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయ ప్రయోజనాల కోసం, తమిళనాడు హక్కులను కాపాడటానికి, అలాగే రాజ్యాంగాన్ని (Constitution) రక్షించడానికి విపక్ష పార్టీలన్నీ కలిసి ఈ బిల్లులను ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

రాహుల్ వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందించారు. “రాజ్యాంగాన్ని, రాష్ట్రాల హక్కులను కాపాడటంలో డీఎంకే పోషించిన చారిత్రాత్మక పాత్రను గుర్తించినందుకు సోదరుడు రాహుల్ గాంధీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తమిళనాడు, తమిళ ప్రజల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ మేము ఎల్లప్పుడూ ప్రతి నిర్ణయం తీసుకున్నాం. ఈ మార్గంలో మేము ఏమాత్రం రాజీపడబోం. చరిత్ర మమ్మల్ని కట్టబొమ్మన్లుగానే (Kattabommans) గుర్తిస్తుందే తప్ప, ఎట్టప్పన్లుగా (Ettappans – ద్రోహులుగా) కాదని నాకు పూర్తి నమ్మకం ఉంది.” అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇక, స్టాలిన్ గుర్తించిన చారిత్రక పేర్ల గురించి ఒకసారి చూద్దాం.. వీరపాండ్య కట్టబొమ్మన్ (Veerapandiya Kattabomman) 18వ శతాబ్దానికి చెందిన తమిళ పాలకుడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 1799లో ఉరితీయబడ్డారు. తిరుగుబాటుకు, పోరాటానికి ప్రతీకగా ఆయనను గుర్తుంచుకుంటారు. మరోవైపు ఎట్టప్పన్ అంటే కట్టబొమ్మన్‌కు ద్రోహం చేసిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. తమిళ రాజకీయ చర్చల్లో ఇది ద్రోహానికి (Betrayal) ప్రతీకగా మారింది. ఈ ఇద్దరి పేర్లను స్టాలిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.