NTV Telugu Site icon

Hyderabad: మిస్టరీగా మారిన యువతి మిస్సింగ్ కేసు.. 50 రోజులు దాటినా లభించని ఆచూకీ

Missing

Missing

చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నుంచి మిస్సింగ్ అయిన యువతి కేసు మిస్టరీగా మారింది. ఆమె కనిపించకుండా పోయి 50 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. హాస్టల్ నుంచి తన మామయ్య ఇంటికి అని బయలుదేరిన విద్యార్థిని మధ్యలోనే అదృశ్యం అయింది. మలక్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినా నేటికీ జాడ దొరకకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

Read Also: Formula E-Car Case: కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు..

ఎల్‌బీ నగర్‌కు చెందిన సౌమ్య కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది. మలక్ పేట్‌లోని బీసీ హాస్టల్‌లో ఉంటున్న సౌమ్య.. అక్టోబర్ 31న చింతల్‌కుంటలో ఉంటున్న తన మేనమామ ప్రహ్లాద్‌కు ఫోన్ చేసి సాయంత్రం ఇంటికి వస్తానని తెలిపింది. 6 గంటలకు మరోసారి కాల్ చేసి హాస్టల్ నుంచి బయలుదేరానని చెప్పింది. రాత్రైనా సౌమ్య ఇంటికి రాకపోవడంతో తన మేనమామ కంగారుపడ్డాడు. వెంటనే అమ్మాయి స్నేహితులకు, బంధువులకు కాల్ చేసి సౌమ్య గురించి ఆరా తీశాడు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మరుసటి రోజు తల్లిదండ్రులు అలివేలు, ఆంజనేయులు హాస్టల్‌కు వెళ్లి తన కూతురు గురించి వాకాబు చేశారు. 31వ తేదీన సాయంత్రమే హాస్టల్ నుంచి వెళ్లిందని సిబ్బంది చెప్పారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు నవంబర్ ఒకటవ తేదీన మలక్ పేట్ పోలీస్ స్టేషన్‌లో సౌమ్య మిస్సింగ్ అయిందని ఫిర్యాదు చేశారు. అంతేకాక ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులుకు వివరాలు అందించారు.

Read Also: Pushpa 2: అల్లు అర్జున్ కి మరో షాక్.. హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు

మలక్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి 50 రోజులు గడుస్తున్నా నేటి వరకు తమ కూతురు ఆచూకీ లభించలేదని, తాము అనుమానం వ్యక్తం చేసిన యువకుడి కుటుంబ సభ్యులను కూడా విచారించలేదని సౌమ్య తల్లిదండ్రులు వాపోతున్నారు. పోలీసులు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ బిడ్డ బతికి ఉందా..? లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని కన్నీరు పెట్టుకుంటున్నారు. పోలీసులు సరైన సమాధానం చెప్పకుండా స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారని వాపోయారు. తాము ఊర్లో కూలి పనులు చేసుకొని జీవనం సాగించే వాళ్లమని, తమకు న్యాయం చేయండి అంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఎదుట పడిగాపులు కాస్తున్నారు.