NTV Telugu Site icon

Kidnap : కిడ్నాప్ కలకలం.. వ్యక్తుల కోసం ఒక్కటైన గ్రామం

Police Turned Kidnapprs

Police Turned Kidnapprs

Kidnap : ‘ఐకమత్యమే మహా బలం’ అన్న నానుడిని నిజం చేశారు ఆ గ్రామస్తులు. కిడ్నాప్ కు గురైన వ్యక్తిని రక్షించుకునేందుకు వారంతా ఒక్కటయ్యారు. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఓ నేరస్తుల ముఠా ష్యోపూర్‌ గ్రామానికి చెందిన రామ్‌ స్వరూప్ యాదవ్, భట్టు బఘేల్, గుడ్డా బఘేల్ నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయారు. వారి కోసం ఆరా తీస్తున్న క్రమంలో రాజస్థాన్‌లోని ఓ ముఠా వారిని కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. ఫోన్ చేసి రూ. 15 లక్షలు చెల్లిస్తే గానీ వారిని విడిచిపెడతామని హెచ్చరించారు. ఆ మాట విన్న బాధిత కుటుంబాలు ఒక్కసారిగా షాకయ్యారు.వారంతా పేదలు కావడంతో అంత సొమ్ము ఎక్కడి నుంచి తేవాలో వారికి అర్థం కాలేదు. విషయం తెలిసిన గ్రామస్థులు రంగంలోకి దిగారు. కిడ్నాప్ చేసిన తమవారిని విడిపించుకునేందుకు ఊరంతా ఏకమైంది. గ్రామంలోని అందరూ పేదలేనని, వారిలో ఎక్కువమంది పశువుల పోషకులేనని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు.

Read Also: Nikki Haley : అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి మహిళ

కిడ్నాప్ అయిన ఓ వ్యక్తి ఇంటికి పైకప్పు కూడా లేదని అన్నారు. అలాంటి స్థితిలో ఉన్న ఆ కుటుంబాలు రూ. 15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురాగలవని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. గ్రామస్థులందరం కలిసి కిడ్నాపర్లు అడిగిన మొత్తాన్ని చందాల ద్వారా కూడబెడుతున్నట్టు చెప్పారు. విషయం తెలిసిన మధ్యప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగారు. రాజస్థాన్ పోలీసులతో కలిసి కిడ్నాపర్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కిడ్నాపర్ల ఆచూకీ చెప్పిన వారికి తొలుత ప్రకటించిన రూ. 10 వేల రివార్డును ఇప్పుడు రూ. 30 వేలకు పెంచారు. కొన్ని నెలల క్రితం ష్యోపూర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. జిల్లాకు చెందిన ఓ రైతును దోపిడీ ముఠా కిడ్నాప్ చేసింది. డబ్బులు చెల్లించిన అనంతరం విడుదల చేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో దోపిడీ ముఠాల ప్రాబల్యం ఎక్కువ కావడంతో ఇక్కడ ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి.