Site icon NTV Telugu

Kurnool Mlc Seat: హాట్ హాట్ గా మారిన కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ

knl mlc

Collage Maker 26 Feb 2023 10.09 Am

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి తారస్థాయికి చేరుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం చేయడం కోసం అధికార పార్టీ నానా తిప్పలు పడుతోంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ మేరకు రంగంలోకి దిగారు. శనివారం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వైసీపీ సమన్వయకర్తలు కడప జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, మాజీ మంత్రి రాంసుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు.

Read Also:Fire In Bus : సూర్యాపేట జిల్లాలో తప్పిన ప్రమాదం.. రెండు బస్సులు బుగ్గి

ఈ ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ ఎ.మధుసూదన్‌, టీడీపీ సహకారంతో ఏపీ సర్పంచుల సంఘ రాష్ట్ర కార్యదర్శి భూమా వెంకటవేణుగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు నర్ల మోహన్‌రెడ్డిలు స్వతంత్రులుగా నామినేషన్‌ వేశారు. కె.శ్రీనివాసులును ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన బేతంచర్లకు చెందిన ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లను అర్థరాత్రి బలవంతంగా తీసుకెళ్లి.. తమ సంతకాలు ఫోర్జరీ చేశారని రిటర్నింగ్‌ అధికారి, జేసీ రామ్‌సుందర్‌రెడ్డికి ఫిర్యాదు చేయించడంతో ఆయన నామినేషన్‌ను పరిశీలనలోనే తిరష్కరించారు. కేసు నమోదు చేస్తామని ప్రకటించారు. ముందు మద్దతు ఇచ్చి తర్వాత ఫోర్జరీ చేయించారనడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

భూమా వేణుగోపాల్‌రెడ్డి, నర్ల మోహన్‌రెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లారు. విత్‌డ్రాకు 27వ తేదీ వరకు గడువు ఉండడంతో అధికార పార్టీ నేతలు ఏకగ్రీవం కోసం అన్ని దారులు వెతుకుతున్నారు. ఇద్దరితో విత్‌డ్రా చేయించాలని ఎమ్మెల్యేలకు మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహ రచనపైనా చర్చించినట్లు సమాచారం. వైసీపీ నాయకులు కలిసి మెలిసి ముందుకెళ్లాలని లేదంటే చూస్తూ ఊరుకోబోమని మంత్రులు వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి కర్నూలు ఎమ్మెల్యే అఫీజ్‌ఖాన్‌, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరుకాలేదు.

Read Also: Pakistan: పాక్ తొలి ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్‌పై కాల్పులు..

Exit mobile version