Minister Usha Sricharan: తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు తెగేసి చెబుతున్నారు.. అయితే, సమ్మె విరమించండి అంటూ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.. అంగన్వాడీల సమస్యలపై సచివాయలంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్షకు పెంచామని గుర్తుచేశారు. ఉద్యోగ విరమణ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశామన్న ఆమె.. గతంలో తెలంగాణ కు సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరిన వెంటనే వేతనాలను రూ.11,500కు పెంచాం.. పదోన్నతి వయస్సును కూడా పెంచామన్నారు.
అయితే, అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్.. అర్హతను బట్టి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని తెలిపారు. కానీ, అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదని స్పష్టం చేశారు. ఇక, అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టారంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందిస్తూ.. ఎవరూ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఆయా జిల్లా కలెక్టర్ లు కేంద్రాలను నడిపేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు మంత్రి ఉషశ్రీ చరణ్.. కాగా, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగినా గత నాలుగు సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి డీఏ కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు.. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం కష్టంగా ఉంది. అంతే కాకుండా అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు.. తెలంగాణ కంటే కనీసం వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నెరవేరలేదని అంటున్నారు అంగన్వాడీలు.
