NTV Telugu Site icon

Thummala: బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఓ ఒక్క రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా?

Thummala

Thummala

Minister Thummala Nageshwara Rao: చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదంటూ బీజేపీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.”2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్ధానాలు ఏమయ్యాయి? రైతుల ఆదాయం రెట్టింపు కాదు కదా, కనీసం నికరాదాయంలో, గత పది సంవత్సరాలలో పెరిగిన ఖర్చులతో పోల్చుకుంటే, పెరగని వాళ్ళందరినీ బీజేపీ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా?.. స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేసి, రైతులను ఆదుకోమని, రాజధాని వీధులకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న వారి విజ్ఙప్తులు ఎప్పుడన్న పట్టించుకున్నారా? బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా? కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్తల నుంచి నిధులు రికవరీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయగల నిబద్ధత మీకుందా?.. కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద రాయితీ ఇస్తుందని అని చెప్పడం తప్ప రైతాంగానికి ప్రత్యేకంగా చేసేందేమిటి అన్న దానికి సమాధానం చెప్పగలరా?.. పామాయిల్ మీద దిగుమతి పన్ను తొలగించి, పామాయిల్ రైతుల నోట్లో మట్టి కొట్టింది కేంద్రప్రభుత్వ పెద్దలు కాదా?” అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రశ్నలు గుప్పించారు.

Read Also: AP Pension Distribution: ఏపీలో తొలి రోజే 96 శాతం మేర పూర్తైన పెన్షన్ల పంపిణీ..

గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం అమలు చేయని వందల హామీలలో ‘భారత రైతులకు కనీసం మద్ధతు ధర విషయం ఇచ్చిన హామీ’ ఒకటని.. ఈ హామీ అమలు చేయక పోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర రైతులే గత తొమ్మిదేళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. 2023-24 సంవత్సరానికి సీఏసీపీ అంచనా వేసిన క్వింటాలు ధాన్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు రూ.1911 కాగా, స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం క్వింటాలు మద్ధతు ధర 2876 రూపాయలుగా ప్రకటించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. గతంలో ఇచ్చిన హామీని ఉల్లంఘించి తప్పుడు పద్ధతుల్లో లెక్కించి క్వింటాలు ధాన్యానికి ప్రకటించిన ధర కేవలం 2203 రూపాయలు మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. ఫలితంగా రాష్ట్ర రైతులు ప్రతి క్వింటాలుకు 664 రూపాయలు నష్టపోయారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రివర్యులు మాట్లాడగలరా అంటూ ప్రశ్నించారు. కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల గురించి మాట్లాడని వారు.. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా, మాటకు కట్టుబడి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే, వారి అక్కసు ఈ విధంగా వ్యక్తం చేస్తూ మాట్లాడటం సరికాదని యావత్తు తెలంగాణ అభిప్రాయమంటూ తుమ్మల వ్యాఖ్యానించారు.

Read Also: Prashanth Reddy : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము పంటలభీమా పథకంలో రైతువాటా కూడా కట్టడానికి సిద్ధపడుతుండగా.. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేయకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా కల్పించే బాధ్యత మాది అంటూ వెల్లడించారు. ఇప్పటికే సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించామని.. పంటలకు అన్నిటికీ మద్ధతు ధరతో కొనే విధంగా ఈ ప్రభుత్వము కృషి చేస్తుందన్నారు. ఆర్థికవనరులు మితంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే రైతుకూలీలకు భరోసా, కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించి.. అమలు ప్రయత్నాలు చేసే సందర్భములో కేంద్ర పెద్దలు విమర్శలు చేయడం వారిని వారు దిగజార్చుకోవడమేనన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేయని కుటుంబాలకు కూడా వర్తింపచేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై గల ప్రేమను అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. రుణమాఫీ 2024లో అక్కడక్కడా ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ అర్హలైన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాని మీద ఏమైన సందేహాలు ఉంటే బీజేపీ పెద్దలు స్వయంగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చని, రైతాంగాన్ని గందరగోళంలో నెట్టొద్దని విజ్ఙప్తి చేశారు.

వ్యవసాయంలో కీలకమైన డీజిల్, పెట్రోల్ ధరలకు రైతులకు సబ్సిడీపై అందించాల్సిన విషయమై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కోరుతున్నానని.. బీజేపీ నేతలను ఉద్దేశించి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పీఎం కిసాన్ కింద రైతులకు అందించే సహాయాన్ని పెంచాలని, కట్ ఆఫ్ డేట్ ఫిబ్రవరి 2019 నుండి కొత్త డేటా తీసుకొని మరింత మందికి అందేలా చూడాలని కోరారు. రైతు ఉద్యమం సందర్భంగా అమరులైన 708 మందికి పైగా రైతు కుటుంబాలకు తక్షణ పరిహారం చెల్లించి, రైతుల డిమాండ్లు పరిష్కరించేవిధంగా ప్రయత్నాలు చేయాల్సిందిగా తెలంగాణ రైతాంగం తరఫున బీజేపీ పెద్దలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

Show comments