NTV Telugu Site icon

Srinivas Goud: జింఖానా గ్రౌండ్‌లో జరిగిన ఘటనపై కమిటీ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

Srinivas Goud

Srinivas Goud

Srinivas Goud: హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తే సీఎం కేసీఆర్‌ చూస్తూ ఊరుకోరని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. హెచ్‌సీఏ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. టికెట్ల వ్యవహారంలో ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయో అని హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో చర్చలు జరిపామన్నారు. హెచ్‌సీఏ వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు మంత్రి పేర్కొ్న్నారు. బ్లాక్‌ దందాపై ఎవరి వద్దనైనా సమాచారం ఉంటే తెలుపాలని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

హెచ్‌సీఏ ఓ ప్రైవేట్‌ సంస్థ అని.. లా అండ్‌ ఆర్డర్‌ ఫెయిల్యూర్‌కు ఏం సంబంధమని ఆయన అన్నారు. కరోనా తర్వాత జరుగుతున్న క్రికెట్‌ మ్యాచ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న రెండో మ్యాచ్‌ కాబట్టి టికెట్లకు డిమాండ్ ఏర్పడిందన్నారు. హెచ్‌సీఏ పూర్తిగా వైఫల్యం చెందిందని.. విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు. హెచ్‌సీఏకు పూర్తిగా పాలక వర్గం లేదన్న ఆయన.. హెచ్‌సీఏకు మా సహకారాన్ని అందిస్తామన్నారు. ముందే సమాచారం ఇచ్చి ఉంటే కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేవాళ్లమని ఆయన అన్నారు. టికెట్లు ఉండేది 30 నుంచి 35 వేలు అని.. గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్ముడు పోయాయన్నారు. టికెట్ల విక్రయంలో పారదర్శకంగా ఉండాలని హెచ్‌సీఏకు చెప్పామన్నారు. దళారులు టికెట్లు అమ్మితే చర్యలు తప్పవన్నారు. ఉదయం జరిగిన ఘటన దురదృష్టకరమన్న మంత్రి.. గాయపడ్డ వారికి ఉచితంగా మెడికల్ ట్రీట్‌మెంట్ అందిస్తామన్నారు.

మ్యాచ్‌లు ఇవ్వడంలోను తెలంగాణపై వివక్ష కొనసాగుతోందని మంత్రి విమర్శించారు. తెలంగాణలో పోలీసుల వైఫల్యం అనేది ఉండదన్నారు. హెచ్‌సీఏ టిక్కెట్లు తొందరగా ఆఫ్‌లైన్‌లో పెట్టడం వల్లే సమస్య వచ్చిందన్నారు. హెచ్‌సీఏ ఒకరిద్దరితో పరిమితం అయ్యింది…దీనితో కోఆర్డినేషన్‌ సమస్య వచ్చిందన్నారు. జింఖానా గ్రౌండ్‌లో జరిగిన ఘటనపై కమిటీ వేస్తున్నామన్న మంత్రి.. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు జింఖానా మైదానంలో టికెట్స్ విక్రయం ముగిసింది. ఇక ఆఫ్ లైన్‌లో టికెట్లు లేవని హెచ్‌ సీఏ స్పష్టం చేసింది. క్యూ లైన్‌లో మిగిలిన 500 మందికి పైగా అభిమానులను పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. టికెట్స్ దొరకని వారికి పోలీసులు సర్ది చెప్పి పంపించివేశారు. ఈ నేపథ్యంలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Gymkhana Stadium: అజహరుద్దీన్‌ సహా క్రికెట్‌ అసోసియేషన్ సభ్యులు ఆఫీసుకు రండి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయని హెచ్‌సీఏపై చర్యలకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. 30 వేల మందికి పైగా అభిమానులు వస్తే కేవలం 4 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. సరైన నిర్వహణా ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు ఎంతమంది వస్తారనేది స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్వహణా వైఫల్యం కారణమని విమర్శలు వస్తున్నాయి. టికెట్లు ఇచ్చే జింఖానా గ్రౌండ్ లో 4 కౌంటర్లు ఉండగా మహిళల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయలేదు. దీంతో గ్రౌండ్ గేట్లు తెరవగానే పురుషులతో పాటు మహిళలూ లోపలికి పరిగెత్తి ఒకే లైన్లో నిలబడగా తోపులాట జరిగింది. మూడు రోజులుగా జింఖానా గ్రౌండ్ వద్దే నిరీక్షించినా.. టికెట్లు దేవుడెరుగు.. పోలీసుల లాఠీ దెబ్బలు రుచిచూడాల్సి వచ్చింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ప్రతిఫలం ఇదేనా అంటూ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ట్విటర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు.