నేడు క్రీడా దినోత్సవం సందర్బంగా తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓయూలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరైయ్యారు. కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మరో ఇరువై ఏళ్ళు అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని కామెంట్స్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి మేమంతా కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. అలాగే ఓయూలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు’.
అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ఇప్పటినుంచే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం పాదయాత్రతో ప్రజల్లో తిరుగుతూ.. అధికార పార్టీపై ఏమాత్రం అవకాశం దొరికిన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు సైతం బీజేపీ పార్టీపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీని గద్దె దించకపోతే దేశానికే ప్రమాదంగా తెరాస నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్కడ మీరు.. ఇక్కడ మేము 20 ఏళ్ళు అధికారంలో ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలను ఒకటిగానే చూస్తున్నామని మొదటినుంచి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.