Anganwadi Recruitment: అంగన్‌వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్‌లైన్..

Minister Seethakka

Minister Seethakka

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. అందులో భాగంగా అంగన్‌వాడీ టీచర్ల నుంచి నేరుగా సలహాలు, సూచనలు స్వీకరించేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సమస్యలను తక్షణమే గుర్తించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీచర్లు, ఆయాలకు అందించే నూతన యూనిఫామ్‌లను పరిశీలించి, అక్టోబర్ మొదటి వారంలోగా వాటిని సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం 17 ఉన్న శిశు దత్తత కేంద్రాలను విస్తరించి ప్రతి జిల్లాలోనూ ఒక అడాప్షన్ సెంటర్ ఉండేలా చూడాలన్నారు.

ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే 16 జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇచ్చామని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో కలెక్టర్లతో మాట్లాడి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు అందుతున్న పోషకాహారం, వారి ఎదుగుదలపై శాంపిల్ సర్వే నిర్వహించి నివేదిక అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ నిధులు ల్యాప్స్ కాకుండా పూర్తి స్థాయిలో వినియోగించాలని అధికారులకు నిర్దేశించారు.