NTV Telugu Site icon

Seethakka: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలిసిన మంత్రి సీతక్క..

Seethakka

Seethakka

సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో మంత్రి సీతక్క కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ని తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క కలిశారు. తెలంగాణలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కోరారు. తెలంగాణలో 6,176 గ్రామ పంచాయతీలకు భవనాలు లేవని కేంద్ర మంత్రికి నివేదించారు. తాత్కాలిక భవనాల్లో గ్రామ పంచాయతీలు.. తమ విధులను సరిగా నిర్వర్తించలేకపోతున్నామని కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ స్కీం ద్వారా పంచాయతీ భవనాల నిర్మాణం కోసం రూ. 1544 కోట్లు మంజూరు చేయాలని మంత్రి సీతక్క వినతి అందించారు.

Read Also: Jagadish Reddy: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీనే..

మరోవైపు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు. తెలంగాణ ఎంపీల ప్రమాణాన్ని వీక్షకుల గ్యాలరీ నుంచి చూశారు. లోక్ సభ గ్యాలరీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని కలిశారు.

Read Also: CM Chandrababu: చంద్రబాబు భావోద్వేగం.. మళ్లీ జన్మ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా..

ఇదిలా ఉంటే.. ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ న‌డ్డాను కలిశారు. జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు విడుద‌ల చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. ఎన్‌హెచ్ఎం కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన పెండింగ్ నిధులు స‌త్వర‌మే విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. సోమవారం కేంద్ర గృహ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని వచ్చేలా సహకరించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. 2024-25 ఆర్థిక సంవ‌త్సరంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్షల ఇళ్లు మంజూరు చేయాల‌ని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.