Site icon NTV Telugu

Minister Seethakka : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష

Seethakka

Seethakka

పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్ర్తీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి తెలియజేసారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అందరం కలిసి పనిచేస్తూ శాఖను బలోపేతం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అణగారిన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడంలో, వారి జీవన ప్రమాణాలు పెంపొందించడంలో గ్రామీణ రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. ఈ రోడ్ల నిర్మాణంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వారి పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు.

అలాగే అన్ని గ్రామీణా ప్రాంతాలకు, తండాలకు మండల కేంద్రాల నుండి రోడ్ల అనుసంధానం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. PMGSY, MGNREGS వంటి వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను పొంది సమర్థవంతంగా వాటిని వినయోగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించినందున 2014 నుంచి నాబార్డు నిధులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనులకు పొందలేకపోయారని, ఈ సందర్భంగా పంచాయతీరాజ్ పనులకు నాబార్డు నుండి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, నాసిరకమైన పనులు చేయకూడదని, అలాచేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిఆర్ ఇంజినీరింగ్ విభాగం యొక్క నిబద్ధత మరియు సామర్థ్యాలపై మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. సవాళ్లను అధిగమించడానికి, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పించడంలో అందరూ సహకరించాలని కోరారు. శాఖాపరమైన సమస్యలు, పెండింగ్ బిల్లుల విషయాన్ని గౌరవనీయులైన సిఎం దృష్టికి తీసుకెళ్తానని, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

Exit mobile version