NTV Telugu Site icon

AP Legislative Council: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని పీపీపీ మోడ్‌లో నిర్మిస్తాం!

Minister Satya Kumar Yadav

Minister Satya Kumar Yadav

ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులను పీపీపీ మోడ్‌లో నిర్మిస్తాం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల ఆధునికీకరణకు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో మందుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. నందిగామలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ అంశంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు వెల్లువెత్తాయి. సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

‘రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నాం. నాడు -నేడు కింద ఆస్పత్రుల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రూ.14 వేల106 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. గత ప్రభుత్వం కేవలం రూ.2445 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.246 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంలో గత ప్రభుత్వానికి చిత్తశుద్ది లోపించింది. ఆస్పత్రులు నిర్మాణం కోసం రూ.14106 కోట్లలో నాబార్డు, కేంద్రం ద్వారా సాయం అందే అవకాశం ఉన్నా వినియోగించలేదు. ఆస్పత్రుల నిర్మాణం కోసం రాష్ట్రం రూ.3400 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా ఐదేల్లలో కేవలం రూ.963 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు’ అని మంత్రి సత్యకుమార్ చెప్పారు.

‘కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చే నాటికి సూపర్ స్పషాలిటీ ఆస్పత్రుల్లో 59 శాతం ఖాళీలు ఉండగా భర్తీ ప్రక్రియ చేపట్టాం. రాష్ట్రంలో ఆస్పత్రుల ఆధునికీకరణకు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మిస్తున్నాం. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రాష్ట్రంలో మరో 3,300 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నిర్మిస్తాం. ప్రతి నియోజక వర్గంలో 100 పడకల ఆస్పత్రులను పీపీపీ మోడ్లో నిర్మిస్తాం. నందిగామ ఏరియా ఆస్పత్రి స్థానంలోనే వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తాం. నందిగామలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఆస్పత్రుల్లో మందుల సరఫరాకి గత ప్రభుత్వం వెయ్యి కోట్లు బకాయి పెట్టగా.. రూ.700 కోట్లకు పైగా చెల్లించాం. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో మందుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు’అని మంత్రి చెప్పుకొచ్చారు.