Minister RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుది మాటల ప్రభుత్వమన్న మంత్రి రోజా.. జగన్ మోహన్ రెడ్డిది చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశాడని తీవ్రంగా విమర్శించారు. పాదయాత్రలో చెప్పిన ప్రతీ హామీని జగన్ నెరవేరుస్తున్నారన్నారు. దేశంలోనే ఏపీని టాప్ 5 రాష్ట్రాల సరసన నిలిపారని ఆమె పేర్కొన్నారు. బెస్ట్ 5 సీఎంల జాబితాలో జగన్ మోహన్ రెడ్డి నిలిచారని మంత్రి తెలిపారు. మ్యానిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు పరచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. పబ్లిసిటీకి జగన్ మోహన్ రెడ్డి దూరం అని ఆమె వెల్లడించారు. మనం కాదు మన చేతలు మాట్లాడాలనుకునే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ ప్రశంసించారు. “చంద్రబాబు డ్రామాల గురించి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. బాబుకు కష్టాలు వచ్చినప్పుడల్లా దాన్ని ప్రజల సమస్యగా చిత్రీకరించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు రూ.118 కోట్ల ముడుపుల కేసులో జైలుకెళ్లడం ఖాయమని తెలిసి.. చంద్రబాబు సింపతీ కోసం కొత్త డ్రామా ఆడుతున్నాడు.” అని ఆర్కే రోజా పేర్కొన్నారు.
Also Read: Kodali Nani: చంద్రబాబును అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా?
ప్రతీ ఒక్కరికీ మేలు జరగాలని గడప గడపకు ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజల వద్దకే పంపించారని తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం నభూతో నః భవిష్యత్ అని వెల్లడించారు. వైయస్సార్ రెండు అడుగులు ముందుకేస్తే… జగనన్న నాలగు అడుగులు ముందుకేశారన్నారు. తండ్రిని మించిన తనయుడిగా జగనన్న ప్రజలకు మంచి చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. జగనన్న దమ్మున్న నాయకుడు అంటూ.. 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన రియల్ హీరో జగనన్న అంటూ రోజా పేర్కొన్నారు. నియోజకవర్గాల సమీక్షలో గుర్తించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
గతంలో మిల్లర్లు రైతులను జలగల్లా పీడించేవారని.. రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా ధాన్యం కొంటోందన్నారు. కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఆలోచనతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రైతులను ఇబ్బంది పెట్టే మిల్లుల పై చర్యలు తీసుకుంటామన్నారు. పార్ధసారధిని మరోమారు పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నామన్నారు. జగనన్న వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుందని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు.