Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా మెరుగుగా లేకపోయినా, గత పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
Read Also: Sridhar Babu: ప్రజలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను చేపట్టాం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావన గురించి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు మెజారిటీ ఇచ్చినట్లే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవాలనే లక్ష్యంతో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఆయన సూచించారు. గ్రామస్థాయిలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పట్టభద్ర ఓటర్లను స్నేహపూర్వకంగా కలుసుకొని, వారిని ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య పరచాలని కోరారు.
ఇక మహాశివరాత్రి రోజున ఓటింగ్ జరుగుతుందని, తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. అందుకే, ప్రతి ఓటర్ ముందుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ రావాలని ఆకాంక్షిస్తూ, అందరూ అప్రమత్తంగా ఉండి ఓటింగ్ ప్రక్రియను విజయవంతంగా ముగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.