Minister Parthasarathy: ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి రూ. 1600 కోట్లు బకాయిలు ఉన్నాయని.. వీటిల్లో రూ. 1000 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి పేర్కొన్నారు. ధాన్యం సేకరణ బకాయిలు చెల్లింపులకు రూ. 2 వేల కోట్ల మేర రుణం తీసుకోవాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ నిమిత్తం రూ. 3200 కోట్ల రుణానికి బ్యాంక్ గ్యారెంటీలిచ్చామన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన క్రాప్ ఇన్సూరెన్స్ వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని.. క్రాప్ ఇన్సూరెన్స్ విధానంపై ఫైనాన్స్, సివిల్ సప్లైస్, వ్యవసాయ శాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశారని చెప్పారు. నెల రోజుల్లో సబ్ కమిటీ నివేదికివ్వాలని కేబినెట్ సూచించినట్లు తెలిపారు.కౌలు రైతుల మేలు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కౌలు రైతులకు సరైన సాయం.. రుణాలు అందడం లేదన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులను ఇవ్వడం ద్వారా సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తామన్నారు. కౌలు రైతుల సమస్యలపై అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మొత్తం 60 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
Read Also: Suryadevara Prasanna Kumar: ఏపీ శాసనమండలి సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్న కుమార్ నియామకం
ల్యాండ్ టైటిలింగ్ రద్దు..
గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ అనే భయంకర చట్టాన్ని తెచ్చిందని.. నీతిఆయోగ్ సిఫార్సులను పక్కన పెట్టి రైతులను.. జనాన్ని భయపెట్టేలా నాటి సర్కార్ చట్టం చేసిందని మంత్రి వ్యాఖ్యానించారు.
రెవెన్యూ వ్యవస్థలను.. రికార్డులను ధ్వంసం చేసేలా గత ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చేసిందన్నారు. జిరాక్స్ కాపీలు ఇస్తామనే రీతిలో గత సర్కార్ చట్టం చేసిందని.. భూ వివాదాలు వస్తే కింది కోర్టులకెళ్లే పరిస్థితి కూడా లేకుండా చట్టాన్ని రూపొందించారని మంత్రి మండిపడ్డారు. ఈ ఆందోళనలు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదించిందని ఆయన వెల్లడించారు.
ఉచిత ఇసుక సరఫరాకు ఆమోదం
స్వార్ధం ఎక్కువగా, ప్రజా ప్రయోజనం తక్కువగా ఉండేలా గత ప్రభుత్వ నిర్ణయాలు ఉండేవని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ఇసుక అమ్మకాలపై పెద్ద పెద్ద సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేశామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఖజనాకు ఇసుక ద్వారా ఆదాయం లేదని పేర్కొన్నారు. సీనరేజీ మినహా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఆశించకుండా ఉచిత ఇసుక సరఫరాకు ఆమోదం లభించిందన్నారు. ఇప్పటికే జారీ చేసిన జీవోను ర్యాటిఫై చేశామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసురోవాలని సీఎం సూచించారని చెప్పారు. ఇసుక తవ్వకాల విషయంలో గత ప్రభుత్వం సుప్రీం కోర్టును కూడా పక్క దోవ పట్టించిందని ఆరోపించారు. కోర్టులకూ గత ప్రభుత్వం తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చిందని మంత్రి అన్నారు.