NTV Telugu Site icon

Minister Niranjan Reddy: జూపల్లి, పొంగులేటిపై మంత్రి నిరంజన్‌ రెడ్డి మండిపాటు..

Niranjan Reddy

Niranjan Reddy

Minister Niranjan Reddy: బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. జూపల్లి , పొంగులేటి పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని.. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సందర్భం లేకున్నా సందర్భం సృష్టించుకొని ప్రవర్తించారన్నారు. తమను ఏం చేయలేరనుకొని ఇష్టారీతిలో వ్యవహరించారు.. వ్యక్తులకు తలొగ్గి పార్టీ ప్రవర్తించదన్నారు. ఒకరిద్దరి కోసం పార్టీని పణంగా పెట్టమని మంత్రి చెప్పారు. పార్టీ అధినేతనే విమర్శించే స్థాయికి చేరుకోవడం పరాకాష్ట అంటూ మండిపడ్డారు.

ఎవరినైనా పార్టీ వీడకుండా ఉండాలనే పార్టీ చూస్తుందని.. కేసీఆర్‌ను తిట్టిన వారిని కూడా రాష్ట్ర అవసరాల దృష్ట్యా పార్టీలో చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ స్థాపించిన 11ఏళ్ళ తర్వాత జూపల్లి పార్టీలో చేరారని.. కానీ జూపల్లికి పార్టీ కూడా ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని జూపల్లికి మంత్రి గా అవకాశం ఇచ్చారన్నారు. ఓడినా ఓపికతో వేచి చూడాలని పార్టీ చెప్పిందని.. కేటీఆర్ కూడా చాలా సార్లు మాట్లాడారన్నారు. జూపల్లికి సొంత ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం లేదని మంత్రి అన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడే అంశాలే జూపల్లి, పొంగులేటి మాట్లాడుతున్నారన్నారు. అభివృద్ధి జరగకుంటే ఇన్ని రోజులు పార్టీలో ఎందుకు ఉన్నారని.. పార్టీని బలహీన పరచాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరాలోచన చేసుకుంటారని ఇన్ని రోజులు వేచి చూశామని.. కేసీఆర్‌ను విమర్శించి బయటకు వెళ్లి విజయం సాధించిన వారు ఇప్పటివరకు ఎవరు లేరన్నారు.

Read Also: CPI Narayana: వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ సర్కారుకు సీపీఐ మద్దతు

తెలంగాణ ఏర్పడిన తర్వాత పొంగులేటి టీఆర్ఎస్‌లో చేరారని.. తెలంగాణ ఉద్యమంలో పొంగులేటి పాత్ర లేదన్నారు. పొంగులేటి పార్టీలో ఏం చేసారో.. ఎందుకు అవకాశం రాలేదో ఖమ్మం ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినప్పుడే జూపల్లి రాజీనామా చేయాల్సిందన్నారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుంటే అదిష్టానం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని కాదని రెబల్స్ ను పోటీ పెట్టాడని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గత తొమ్మిది ఏళ్ళుగా ఆత్మాభిమానం ఎటుపోయిందని.. ఇన్ని రోజులు ఏం చేశారని మండిపడ్డారు. జూపల్లి జగన్ కోసం రాజీనామా చేసాడు.. తెలంగాణ కోసం చేయలేదని ఆయన ఆరోపించారు. జూపల్లి ఇంట్లో ఇంకా వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో ఉంటుంది.. కేసీఆర్ ఫోటో ఎందుకు లేదని తాను అడిగానన్నారు. తెలంగాణ వ్యతిరేకి అయిన వైఎస్సార్ ఫోటో ఎందుకు జూపల్లి పెట్టుకున్నారని ప్రశ్ని్ంచారు. మంత్రిగా తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా వైఎస్సార్ విగ్రహం పెట్టారని పేర్కొన్నారు. నిన్న మొన్న ఆంధ్ర నుంచి వచ్చి పార్టీ పెట్టిన వాళ్ళు విమర్శించినట్లే ..పొంగులేటి, జూపల్లి విమర్శిస్తున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి వివరించారు.