NTV Telugu Site icon

Minister Rama Naidu: వెలుగొండ ప్రాజెక్టు పటిష్టతపై మంత్రి నిమ్మల సంచలన కామెంట్లు

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu

Minister Nimmala Rama Naidu: వెలుగొండ ప్రాజెక్టు పటిష్టతపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలుగొండ హెడ్ రెగ్యులెటర్ పనుల్లో నాణ్యత లేదని మంత్రి నిమ్మల మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులెటర్ ప్రాజెక్టు పనుల్లో నాణ్యత సరిగా లేదని ఆయన విమర్శించారు. హెడ్ రెగ్యులెటర్ పనుల నాణ్యతపై అనుమానం ఉందన్నారు. వెలుగొండ హెడ్ రెగ్యులెటర్ పనులు కడప జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ చేపట్టాడని.. ఒక్క పైసా పెండింగ్ లేకుండా బిల్లులన్నీ డ్రా చేసేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. వెలుగొండ పనులు చేపట్టిన అధికారులే ఈ విషయం మా సమీక్షల్లో చెబుతున్నారని ఆయన తెలిపారు. వాళ్ల మెడకు చుట్టుకుంటుందనే భయంతో అధికారులు వాస్తవాలు బయట పెడుతున్నారని వెల్లడించారు. కాంట్రాక్టర్ చేపట్టిన హెడ్ రెగ్యులెటర్ పనులను నాడు అధికారులు కూడా సరిగా పర్యవేక్షించ లేదన్నారు మంత్రి రామానాయుడు.

Read Also: Balineni Srinivas Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారణ

పరదాలు కట్టి.. ప్రజలు రాకుండా వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించారంటూ ఆయన ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం ఇస్తూ నిర్వాసితులకు నోటీసులిస్తారా..? అంటూ ప్రశ్నించారు. జగన్ అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అని.. ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. జగన్ చేసిన అప్పుల్నే కాదు.. తప్పులు కూడా మేమే భరించాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్ విధ్వంసక పాలనకు నిలువెత్తు నిదర్శనమన్నారు. వెలుగొండ టన్నెల్-1 500 మీటర్లు, టన్నెల్-2లో 7 కిలో మీటర్ల లైనింగ్ పనులు గత ప్రభుత్వం పూర్తి చేయలేదని.. లైనింగ్ పూర్తి చేయకుండా నీటి విడుదల సాధ్యమా..? అంటూ మంత్రి ప్రశ్నించారు. టన్నెల్ బోరింగ్ మిషన్- టీబీఎం రెండో టన్నెల్లో చిక్కుకుపోయుందని.. మూడేళ్ల నుంచి టీబీఎం టన్నెల్లో చిక్కుకున్నా.. తాడేపల్లి ప్యాలెస్సులో జగన్ మొద్దు నిద్ర పోయారంటూ విమర్శించారు.

Read Also: Minister Atchannaidu: ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు.. వ్యవసాయ మంత్రి కీలక ఆదేశాలు

వెలుగొండ నీరు ప్రహహించాల్సిన ఫీడర్ కెనాల్‌కు గండ్లు పడ్డాయని మంత్రి తెలిపారు. చిన్నపాటి వర్షానికే ఫీడర్ కెనాల్‌కు గండ్లు పడ్డాయన్నారు. 11 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే.. ఫీడర్ కెనాల్‌కు పడిన గండ్లు నుంచి నీరు గ్రామాలను ముంచెత్తుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టు.. నల్లమల సాగర్‌లో అర టీఎంసీ నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వెలుగొండ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ. 1100 కోట్లు ఆర్ అండ్ ఆర్ అవసరమని.. ఐదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు విడుదల చేయలేదంటూ మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టును అన్ అప్రూవుడ్ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటిస్తే జగన్ నిద్ర పోయారని మంత్రి ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ. 4 వేల కోట్లు అవసరమవుతాయని ఆయన తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు.

గత ఐదేళ్ల కాలంలో ఇరిగేషన్ కోసం నామమాత్రపు ఖర్చు చేశారన్న ఆయన.. మా ఐదేళ్లల్లో రూ. 68 వేల కోట్ల ఖర్చు పెడితే.. వైసీపీ హయాంలో రూ. 19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులకు గ్రీజు కూడా పెట్టలేకపోయారు.. గేట్లు కొట్టుకుపోయాయని మంత్రి విమర్శించారు. సోమశిల ప్రాజెక్టు గేట్లు, షట్టర్లు రోప్స్ తుప్పు పట్టిపోయేలా చేశారని పేర్కొన్నారు. నీరు నిండితే సోమశిల ప్రాజెక్టు గేట్లు మూస్తే గేట్లు కొట్టుకుపోతాయేమోననే ఆందోళన ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా సరిగా లేవన్నారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడుతోంటే జగన్‌, అంబటి ఆశ్చర్యపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.