Site icon NTV Telugu

Minister Narayana: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు.. ప్రారంభమయ్యేది అప్పుడే..

Minister Narayana

Minister Narayana

Minister Narayana: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించగా.. ఆ మరుసటి రోజు రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీలో 100 అన్న క్యాంటీన్లను పేదల ఆకలి తీర్చేందుకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. అయితే రాష్ట్ర సర్కారు 203 అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 13న మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన అన్న క్యాంటీన్లను అక్టోబర్‌లో ఏర్పాటు చేస్తామన్నారు.

Read Also: CM Chandrababu: దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

విశాఖ వీఎంఆర్డీఏ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. విశాఖ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీతో మంత్రి సమావేశం కాగా.. నగరంలో అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు నేతలు. ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో మున్సిపల్ శాఖ నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. గతంలో మున్సిపల్ మంత్రి ఉన్నాడా లేడో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 27 వేల కోట్లు కేంద్రం ఇచ్చే డబ్బులు వదిలేశారని.. మ్యాచింగ్ ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నిధులు వృథాగా పోయాయన్నారు. కొన్ని నిధులను దుర్వినియోగం చేసి మళ్లింపులు చేశారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. టౌన్ ప్లానింగ్ ఎంత అద్వానంగా తయారయింది.. చూస్తే అర్థమవుతుందన్నారు. మాస్టర్ ప్లాన్‌పై, అభ్యంతరాలు వ్యక్తం చేశారని.. దీని పైన ఒక కన్సల్టెంట్ నియమించి, లోపాలను సరి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ భరత్ తెలిపారు. గతంలో వీఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అనేక అవకతవకలు జరిగాయని.. వాటిని సరి చేయాలని కోరామన్నారు. ఐదు సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వినియోగించుకోలేక పోయారన్నారు. అనేక పన్నులు తీసుకొచ్చి ప్రజా వ్యవస్థను అస్తవ్యవస్థం చేశారన్నారు. జీవీఎంసీ ఆదాయాన్ని పెంచడానికి కొత్త కొత్త విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామన్నారు.

Exit mobile version