వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెలాఖరుకు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తవుంటుందని, ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం అని చెప్పారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. నేడు రాజధాని ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. నేలపాడులో ఐకానిక్ బిల్డింగ్ పునాదులను పరిశీలించారు. పునాదుల్లోకి నీరు చేరడంతో మిషన్ సహాయంతో నీటిని బయటకు పంపుతున్న కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు.
‘ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ 2015లో ఇచ్చాము. కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాలు రైతులు రాజధానికి ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన రాజధాని బాద్యతల కోసం విదేశాలు తిరిగాను. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీల అన్ని నిర్మాణం చెయ్యాలి. అధికారులకు 4 వేలకు పైగా అపార్టుమెంట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. గత ప్రభుత్వం మా మీద కక్షతో అధికారులు, మంత్రులకు ఇవ్వలేదు. అసెంబ్లీ టవర్ 250 మీటర్ల ఎత్తులో డిజైన్ జరిగింది. అధికారులు అందరూ ఒకే చోట ఉండేలా.. సీఎం ఆలోచలతో 5 టవర్లతో నిర్మాణం డిజైన్ చేశారు’ అని మంత్రి నారాయణ తెలిపారు.
‘అమరావతి క్యాపిటల్ సిటీలో 360 కిమీ ట్రంక్ రోడ్లు ఉన్నాయి. లేఔట్ల దగ్గర కేబుల్ లైన్లు, వాటర్ లైన్లు అన్ని అండర్ గ్రౌండ్లో ఉండాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అమరావతి రాజధాని ముఖ్య నిర్మాణాల దగ్గర పునాధుల్లో ఉన్న నీటిని తొలగించే కార్యక్రమం జరుగుతోంది. రాజధాని పనులకు సంబంధించి కొన్ని లీగల్ ప్రోబ్లమ్స్ ఉన్నాయి. రివర్స్ టెండెరింగ్ విధానం వంటివి అన్ని స్థాయిల్లో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. టెండర్ ప్రక్రియకు ఆధారిటీ ఆమోదం ఇచ్చింది. ఈ నెలాఖరు లోగా అన్ని టెండర్లు పూర్తవుతాయి. వచ్చే నెల రెండో వారంలో పనులు ప్రారంభవుతాయి. రాబోయే మూడేళ్లలో అమరావతి రాజధాని పూర్తవుతుంది’ అని మంత్రి నారాయణ చెప్పారు.