Site icon NTV Telugu

Nara Lokesh: విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: ఏపీలో నూతనంగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి సారించింది. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు లోకేష్ సూచించారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Andhra Pradesh: ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్

ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్థిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వాలని సూచించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్థంతరంగా నిలిచిపోయిన ఫేజ్-2 పనులు, ఫేజ్-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు అందజేయాలన్నారు. గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version