NTV Telugu Site icon

Minister Nara Lokesh: రెడ్ బుక్ పని ప్రారంభమైంది… తప్పుచేసిన వారిని వదలం..

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: “మాజీ ముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు. మనం ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలి. మేం చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాం. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని” రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రెడ్ బుక్ పని ప్రారంభమైంది..తప్పుచేసిన వారిని వదలమన్నారు. శ్రీకాకుళంలో స్కూలు పరిశీలన అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ… తిరుమల లడ్డూ నాణ్యతా లోపంతో పాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో తన దృష్టికి తెచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈవోకు చెప్పామన్నారు. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ 250 కోట్లు ఉండాలన్న నిబంధనను వైవీ సుబ్బారెడ్డి రూ.150కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారని మంత్రి ప్రశ్నించారు. తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశామని, ఆ కమిటీ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఇప్పుడు తిరుమల లడ్డూ క్వాలిటీ బాగుందని వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా చెబుతున్నారన్నారు.

Read Also: Janasena: పవన్‌ సమక్షంలో జనసేనలో చేరిన బాలినేని, సామినేని, కిలారి రోశయ్య

సూపర్ సిక్స్ పథకాల అమలుపై విలేకరుల ప్రశ్నలకు లోకేష్ సమాధానమిస్తూ.. జగన్ లా మేం పారిపోయే వ్యక్తులం, కాదని, ఇప్పటికే పెన్షన్లు, మెగా డీఎస్సీ హామీలను అమలు చేశామన్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారని చెప్పారు. పథకాల అమలుపై మాకు చిత్తశుద్ధి ఉందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు. జగన్ లా పరదాలు కట్టుకుని మేం తిరగడం లేదన్నారు. తప్పు చేయకపోతే వారు ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల మధ్య ప్రజావేదిక నిర్వహిస్తున్నారన్నారు.